మేం వచ్చి 2 నెలలే.. అయినా అది మా ఘనతే
దేశవ్యాప్తంగా సమర్థులైన ముఖ్యమంత్రుల జాబితాలో ఏపీ సీఎం చంద్రబాబు నాలుగో స్థానంలో ఉన్నారని ఓ సర్వే తేల్చినట్టు టీడీపీ ప్రకటించుకుంది.
అచ్యుతాపురం సెజ్ ప్రమాదం విషయంలో సీఎం చంద్రబాబు స్పందన పూర్తిగా వైసీపీని టార్గెట్ చేసేలా ఉంది. తాము అధికారంలోకి వచ్చి 2 నెలలే అయిందని, ఆ ఘటనకు తమది బాధ్యత కాదన్నట్టుగా ఆయన మాట్లాడారు. అదే సమయంలో ఆ తప్పుకి జగన్ ప్రభుత్వానిదే బాధ్యత అని ఆయన అన్నారు. ఇక గతంలో జరిగిన ప్రమాదాలు, మరణాలు, వాటి వివరాలన్నిటినీ టీడీపీ సోషల్ మీడియా విస్తృతంగా ప్రచారం చేసింది. ఇంతవరకు బాగానే ఉంది కానీ.. మేం వచ్చి 2 నెలలేనంటూ చంద్రబాబు మాట్లాడిన గంటల వ్యవధిలోనే టీడీపీ నుంచి మరో ట్వీట్ పడింది. 2 నెలల్లోనే ఏపీ సీఎం ఘనత ఇదీ అంటూ గొప్పలు చెప్పుకుంది పార్టీ.
దేశవ్యాప్తంగా సమర్థులైన ముఖ్యమంత్రుల జాబితాలో ఏపీ సీఎం చంద్రబాబు నాలుగో స్థానంలో ఉన్నారని ఓ సర్వే తేల్చినట్టు టీడీపీ ప్రకటించుకుంది. చంద్రబాబు సీఎంగా వచ్చిన 2 నెలల్లోనే, అటు అభివృద్ధి, ఇటు సంక్షేమంలో దూసుకుపోతున్నారని, అత్యుత్తమ పాలన అందిస్తున్న ముఖ్యమంత్రిగా ఆయన పేరు సర్వేలో ప్రకటించారని చెప్పుకున్నారు.
ఇక్కడే టీడీపీ సెల్ఫ్ గోల్ వేసుకుందని నెటిజన్లు సెటైర్లు పేలుస్తున్నారు. అచ్యుతాపురం సెజ్ ఘటనకు బాధ్యత తీసుకోలేని ముఖ్యమంత్రి, 2 నెలల్లో సమర్థ పాలన జరిగిందని ఎలా గొప్పలు చెప్పుకుంటారని మండిపడుతున్నారు. తప్పులు జరిగితే జగన్ పై నెట్టేసి, తమ హయాంలో గొప్పలు జరిగాయని చంద్రబాబు చెప్పుకోవడం సరికాదని అంటున్నారు. 2నెలల్లో చంద్రబాబు ఏం సాధించారని బెస్ట్ సీఎంగా అవార్డ్ ఇస్తారని కౌంటర్లి ఇస్తున్నారు నెటిజన్లు.