DSC పేరెత్తే అర్హత చంద్రబాబుకి లేదు..

మెగా డీఎస్సీ అనే పేరు వినగానే అందరికీ గుర్తొచ్చే ఒకే ఒక నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. పారదర్శకమైన నియామక ప్రక్రియ అనగానే మొదట గుర్తొచ్చే పేరు వైఎస్ జగన్. మోసం, కుట్ర, వంచన అంటే గుర్తొచ్చే ఏకైక పేరు చంద్రబాబు.

Advertisement
Update:2024-03-31 15:37 IST

ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే మెగా DSC ఫైల్ పై తాను తొలి సంతకం పెడతానంటూ ఇటీవల గొప్పగా చెప్పారు చంద్రబాబు. అదే సమయంలో జగన్ ప్రభుత్వం విడుదల చేసిన DSC నోటిఫికేషన్ పై కోర్టుల్లో కేసులు వేసి నానా రచ్చ చేసింది టీడీపీ టీమ్. దీంతో ఎన్నికల కమిషన్ సూచనతో ఏపీలో డీఎస్సీ వాయిదా పడింది. టెట్ ఫలితాలు, డీఎస్సీ నిర్వహణ అంతా ఎన్నికల తర్వాతేనని తేల్చి చెప్పారు అధికారులు. దీంతో టీడీపీ సంబరాలు చేసుకుంటోంది. డీఎస్సీ ఆపేశామంటూ గొప్పలు చెప్పుకుంటోంది. చంద్రబాబు చెప్పిన మెగా డీఎస్సీని హైలైట్ చేస్తూ ఎల్లో మీడియా హడావిడి చేస్తోంది.

చంద్రబాబు కుట్ర..

ఎన్నికల డీఎస్సీ అంటూ తాజా నోటిఫికేషన్ పై విషం చిమ్మి.. చివరకు పరీక్షలు ఆగిపోయేలా చేశారు చంద్రబాబు. డీఎస్సీకోసం ఆశగా ఎదురు చూస్తున్న నిరుద్యోగులను నిరాశపరిచారు అలాంటి చంద్రబాబు మెగా డీఎస్సీ అంటే నమ్మేదెవరు..? చంద్రబాబు గత చరిత్ర చూస్తే నోటిఫికేషన్ల పేరుతో ఆయన ఎన్ని డ్రామాలాడారో తెలుస్తుంది.

బాబు చరిత్ర..

1996, 98 డీఎస్సీ నియామక ప్రక్రియలో ఇంటర్వ్యూ ప్రాసెస్ ని అడ్డు పెట్టుకుని చంద్రబాబు అస్మదీయులకు ఉద్యోగాలిప్పించుకున్నారు. అర్హత మార్కులు తగ్గించి, డబ్బులిచ్చినవారిని ఇంటర్వ్యూలలో సెలక్ట్ చేసి, ఉద్యోగాలిప్పించారు. ఈ వ్యవహారంలో హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా చంద్రబాబుకి మొట్టికాయలు వేయడం విశేషం. ఇక్కడినుంచే ఉపాధ్యాయ నియామకాల్లో చంద్రబాబు అక్రమాలకు తెరతీశారు.

DSC నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసే సమయంలో ప్రకటించిన ఖాళీలన్నిటినీ ఆ పరీక్ష రాసిన అభ్యర్థులతోనే భర్తీ చేయాలి. అంటే పోస్ట్ లు భర్తీ అయ్యే వరకు సెలక్షన్ లిస్ట్ లు తీయాల్సి ఉంటుంది. కానీ చంద్రబాబు మాత్రం చీకటి జీవోలకు తెరతీశారు. నోటిఫై చేసిన పోస్ట్ లను భర్తీ చేసేవారు కాదు. 1996, 98 DSCలలో దాదాపు 20 వేల పోస్టులు భర్తీ చేయకుండా మిగిల్చారు. వాటిని తర్వాతి డీఎస్సీలకు జతచేసి నిరుద్యోగుల్ని మోసం చేసేవారు. అప్పట్లో కేంద్రప్రభుత్వం ఆపరేషన్ బ్లాక్ బోర్డు పథకం ద్వారా మంజూరు చేసిన 18,500 పోస్టులను కూడా DSC నోటిఫికేషన్లో కలిపేసి డబ్బా కొట్టుకున్నారు బాబు.

ఎన్నికల డీఎస్సీలు ఎవరివి..?

తాజాగా వైసీపీ ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్ ని ఎన్నికల్లో లబ్ధి కోసం విడుదల చేసిన నోటిఫికేషన్ గా టీడీపీ బ్యాచ్ అభివర్ణిస్తోంది. మరి 2003 ఎన్నికల ముందు చంద్రబాబు వేసిన డీఎస్సీని ఏ పేరుతో పిలవాలి. 2014కి ముందు 30వేల టీచర్ పోస్ట్ లు ఖాళీగా ఉన్నాయి. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రేషనలైజేషన్ పేరుతో ప్రభుత్వ స్కూళ్లను నిర్వీర్యం చేశారు. కేవలం 10వేల ఖాళీలకు మాత్రమే డీఎస్సీ నిర్వహించారు. 2016 తర్వాత కూడా ఆ డీఎస్సీ గురించే గొప్పలు చెప్పుకునేవారు. 2018లో కూడా ఎన్నికల ముందు డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి మైండ్ గేమ్ ఆడారు చంద్రబాబు.

జగన్ ఏం చేశారంటే..?

చంద్రబాబు చేసిన మోసానికి బలైపోయి, 25ఏళ్ళ సర్వీస్ కోల్పోయిన 1998 DSC నోటిఫికేషన్ బాధితులకు ఉద్యోగాలిచ్చిన జగన్ వారికి దేవుడిలా మారారు. దాదాపు 5 వేల మంది ఇలా జగన్ వల్ల లబ్ధిపొందారు. 2008 DSC ద్వారా నష్టపోయిన 3వేల మందికి కూడా జగన్ తాను అధికారంలోకి వచ్చాక న్యాయం చేశారు. నాడు-నేడుతో ముందు స్కూళ్ల రూపు రేఖల్ని మార్చి ఇప్పుడు నియామకాలు చేపట్టారు జగన్. వేసవి సెలవల్లో రిక్రూట్ మెంట్ మొదలు పెట్టి, స్కూల్స్ తిరిగి ప్రారంభించేనాటికి నియామకాలు పూర్తి చేయాలనే ఉద్దేశంతో డీఎస్సీ 2024 నోటిఫికేషన్ విడుదల చేశారు జగన్. అయితే దీన్ని ఎన్నికల ప్రక్రియకు ముడిపెట్టి ఏకంగా పరీక్ష వాయిదా పడేలా చేశారు బాబు. ఇలాంటి చంద్రబాబుని నిరుద్యోగులు ఎలా నమ్ముతారు. మెగా డీఎస్సీ పేరుతో మోసం చేయాలనుకున్న చంద్రబాబు బుట్టలో వారు ఎందుకు పడతారు. అసలు మెగా డీఎస్సీ అనే పేరు వినగానే అందరికీ గుర్తొచ్చే ఒకే ఒక నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. పారదర్శకమైన నియామక ప్రక్రియ అనగానే మొదట గుర్తొచ్చే పేరు వైఎస్ జగన్. మోసం, కుట్ర, వంచన అంటే గుర్తొచ్చే ఏకైక పేరు చంద్రబాబు.

Tags:    
Advertisement

Similar News