పవన్ మీద చంద్రబాబుకు నమ్మకం తగ్గిపోతోందా?
జనసేనతో పొత్తు పెట్టుకుంటే కాపుల ఓట్లన్నీ టీడీపీకి పడతాయనే ఆశలు చంద్రబాబులో తగ్గిపోతున్నట్లు టాక్ వినబడుతోంది. అందుకనే టీడీపీతో పొత్తు విషయంలో పవన్ ప్రకటనలు చేస్తున్నట్లు చంద్రబాబు చేయటం లేదు.
క్షేత్రస్థాయిలో జరుగుతున్నది చూస్తుంటే జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై చంద్రబాబు నాయుడులో నమ్మకం తగ్గిపోతున్నట్లుంది. పవన్‌తో పొత్తు పెట్టుకోవాలని చంద్రబాబు అనుకోవటంలో ముఖ్య ఉద్దేశం కాపుల ఓట్లు కోసం మాత్రమే. జనసేనతో పొత్తు పెట్టుకుంటే వచ్చే ఎన్నికల్లో కాపుల ఓట్లన్నీ టీడీపీకి పడతాయని ఒకప్పుడు చంద్రబాబు ఆలోచించారు. అయితే రోజురోజుకు పరిస్థితిలో మార్పు వచ్చేస్తోంది. ఎలాగంటే కాపు సామాజికవర్గంలో ప్రముఖుల్లో చాలామంది జనసేనకు దూరంగానే ఉన్నారు.
సొంత సామాజికవర్గం నుంచి పవన్‌కు మద్దతుగా నిలుస్తుంది ఎవరంటే ఒక్క చేగొండి హరిరామజోగయ్య తప్ప ఇంకెవరూ కనబడటంలేదు. 87 ఏళ్ళు వయసులో ఈయన పవన్ కోసం తిరిగి చేయగలిగింది కూడా ఏమీలేదు. ఇదే సమయంలో పవన్‌ను పూర్తిగా వ్యతిరేకిస్తున్నవారిలో ముద్రగడ పద్మనాభం కీలకం. ముద్రగడ మద్దతుదారులంతా పవన్‌ను వ్యతిరేకిస్తున్నారు. అలాగే మొన్నటివరకు జనసేనలోనే ఉండి ఇప్పుడు బీఆర్ఎస్ ఏపీ శాఖ అధ్యక్షుడు అయిన తోట చంద్రశేఖర్ వర్గం వేరే ఉంది. దీనికితోడు కాపుల్లోనే బలమైన వర్గం వైసీపీతో ఉంది.
ఇక ఉత్తరాంధ్రలోని కాపు నేతల్లో పవన్‌తో సఖ్యత ఉన్నవాళ్లు పెద్దగా లేరు. రాయలసీమలో కూడా డిటోనే. అభిమాన సంఘాల్లో యాక్టివ్‌గా తిరిగేవాళ్ళతో పవన్‌కు ఓట్లు పడే అవకాశాలు తక్కువనే చెప్పాలి. ఈ నేపథ్యంలో జనసేనకు ఎంతో పట్టుందని అనుకుంటున్న ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా పరిస్థితి అతంత మాత్రంగానే ఉందని అంటున్నారు. మొన్నటి ఎన్నికలతో పోల్చుకుంటే పరిస్థితి మెరుగయ్యుండచ్చు కానీ బాగా పుంజుకున్నదని చెప్పేందుకు మాత్రం లేదు.
ఇవన్నీ ఒక ఎత్తయితే పవన్‌కు మద్దతు విషయంలో కాపుల్లోనే మిశ్రమ స్పందన కనబడుతోంది. ఇవన్నీ చూసిన తర్వాత జనసేనతో పొత్తు పెట్టుకుంటే కాపుల ఓట్లన్నీ టీడీపీకి పడతాయనే ఆశలు చంద్రబాబులో తగ్గిపోతున్నట్లు టాక్ వినబడుతోంది. అందుకనే టీడీపీతో పొత్తు విషయంలో పవన్ ప్రకటనలు చేస్తున్నట్లు చంద్రబాబు చేయటంలేదు. జనసేనతో పొత్తు పెట్టుకునే విషయంలో కూడా చంద్రబాబులో మునుపటి ఉత్సాహం ఇప్పుడు కనబడటం లేదు. మరి చివరకు ఏమవుతుందో ఏమో చూడాల్సిందే.