ఈ నవ్వుకి అర్ధమేమిటో ?

కేసీఆర్‌ ప్రకటించిన జాతీయ పార్టీ గురించి స్పందించమని మీడియా ప్ర‌తినిధులు చంద్ర‌బాబును అడుగ‌గా.. ఏమీ మాట్లాడకుండా ఓ నవ్వు నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోయారు.

Advertisement
Update:2022-10-05 15:01 IST

దసరా పండుగ సందర్భంగా చంద్రబాబునాయుడు దంపతులు ఇంద్రకీలాద్రిపైన ఉన్న అమ్మవారిని దర్శించుకున్నారు. తర్వాత ఆలయం బయట ఉన్న మీడియాతో కొద్దిసేపు మాట్లాడారు. అన్నీ పార్టీల మద్దతు, దుర్గమ్మ ఆశీస్సులతోనే నాడు రాజధానిని ప్రకటించామన్నారు. ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చిందన్నారు. మాట తప్పేవారిని అమ్మవారు క్షమించదన్నారు. దుష్టశక్తులను తుడముట్టించే శక్తి అమ్మవారికి ఉందని చెప్పారు.

సరే ఇవన్నీ చంద్రబాబు ప్రతిరోజు చెబుతున్నదే కాబట్టి ఇందులో కొత్తేమీలేదు. అయితే చివరలో కేసీఆర్‌ ప్రకటించిన జాతీయ పార్టీ గురించి స్పందించమని అడిగారు. ఏమీ మాట్లాడకుండా ఓ నవ్వు నవ్వి అక్కడి నుండి వెళ్ళిపోయారు. చంద్రబాబు ఏమీ మాట్లాడకుండా ఓ చిరునవ్వు నవ్వేసి ఎందుకు వెళ్ళిపోయారనే చర్చ మొదలైంది. పైగా ఆ నవ్వులో ఎన్నో అర్ధాలు ఉన్నాయంటు సోషల్ మీడియాలో కామెంట్లు మొదలయ్యాయి.

ఒకప్పుడు చంద్రబాబు, కేసీయార్ మంచి మిత్రులే. తర్వాత ఇద్దరి మధ్య పేచీ వచ్చి దారులు వేరయ్యాయి. దాంతో టీడీపీ నుండి బయటకు వచ్చేసిన‌ కేసీఆర్‌.. టీఆర్ఎస్ ఏర్పాటు చేసి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టారు. ఆ తర్వాత రాష్ట్ర విభజన జరగటం, 2014 ఎన్నికల నుండి వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అవటం అందరికీ తెలిసిందే. తాజాగా ప్రాంతీయ పార్టీ టీఆర్ఎస్‌ను జాతీయపార్టీ బీఆర్ఎస్‌గా మార్చేశారు. ప్రాంతీయ పార్టీ అధినేతగా కేసీఆర్‌ సక్సెస్ అయ్యారనే చెప్పాలి. జాతీయ పార్టీ అధినేతగా జాతీయ రాజకీయాల్లో ఏ విధమైన పాత్ర పోషిస్తారో చూడాలి.

ఈ నేపథ్యంలో టీడీపీని చంద్రబాబు జాతీయ పార్టీగానే చెప్పుకుంటారు. నిజానికి టీడీపీ ప్రాంతీయ పార్టీ మాత్రమే. తన కళ్ళ ముందే ఉద్యమ పార్టీ పెట్టి ప్రాంతీయ పార్టీగా మార్చి రెండు సార్లు కేసీఆర్‌ సీఎం అయిన విధానాన్ని చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారా? ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్‌ను చంద్రబాబు లైటుగా తీసుకుంటున్నారా ? లేదా తాను స్పందించాల్సినంత‌ సీన్ ఆ పార్టీకి లేదన్నదే చంద్రబాబు నవ్వుకి అర్ధమా అన్నదే తెలియ‌డం లేదు. మొత్తానికి చంద్రబాబు నవ్వు అనేక కామెంట్లకు దారితీసిందన్నది మాత్రం వాస్తవం.

Tags:    
Advertisement

Similar News