పెన్షన్ విషయంలో పరోక్షంగా జగన్ ని మెచ్చుకున్న చంద్రబాబు

ఎన్నికల టైమ్ లో వాలంటీర్ల సేవలు లేకపోవడంతో మూడు నెలలపాటు పెన్ష్ దారులు ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఈ ఇబ్బందినే చంద్రబాబు తన లేఖలో హైలైట్ చేశారు.

Advertisement
Update: 2024-06-29 06:14 GMT

ఏపీలో ఇప్పటి వరకూ వాలంటీర్లు ఇంటింటికీ వచ్చి పెన్షన్లు ఇచ్చేవారు. ఎన్నికల సమయంలో ఈ వ్యవహారంలో కాస్త మార్పులొచ్చాయి. ఈసీ నిబంధనల వల్ల పెన్షన్లు బ్యాంకు అకౌంట్లలో జమ అయ్యాయి, కొందరికి మాత్రం చేతికి అందించారు. ప్రభుత్వం మారిన తర్వాత మళ్లీ ఇంటింటికీ పెన్షన్ పంపిణీ మొదలు పెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు పెన్షన్ లబ్ధిదారులకు ఓ బహిరంగ లేఖ రాశారు. ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతున్నా కూడా ఇచ్చిన మాటకోసం పెన్షన్ ఆర్థిక సాయం పెంచి ఇస్తున్నట్టు తెలిపారు.

మీ కష్టాలు చూసి చలించిపోయా..

ఎన్నికల వేళ పెన్షన్ దారుల కష్టాలు చూసి తాను చలించిపోయానని చెప్పారు సీఎం చంద్రబాబు. ఎన్నికల సమయంలో మూడు నెలలపాటు లబ్ధిదారులు కష్టాలు పడ్డారనేది ఆయన అభిప్రాయం. గతంలో చంద్రబాబు హయాంలో కూడా పెన్ష్ దారులు ఇలాగే కష్టాలు పడ్డారు. అప్పట్లో గ్రామ పంచాయితీల చుట్టూ లబ్ధిదారులు తిరగాల్సి వచ్చేది. రెండు లేదా మూడు నెలలకోసారి పెన్షన్లు ఇచ్చేవారు. ఆ కష్టాలన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ వాలంటీర్ వ్యవస్థతో జగన్ సరికొత్త విధానం అమలులోకి తెచ్చారు. ఎన్నికల ముందు వరకు ఈ విధానంలోనే పెన్షన్ దారులు ఒకటో తేదీ ఉదయాన్నే ఇంటివద్ద నగదు తీసుకునేవారు. ఎన్నికల టైమ్ లో వాలంటీర్ల సేవలు వద్దన్నారు కాబట్టి మూడు నెలలపాటు ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఈ ఇబ్బందినే చంద్రబాబు తన లేఖలో హైలైట్ చేశారు. అంటే అంతకు ముందు వైసీపీ హయాంలో పెన్షన్ పంపిణీ సక్రమంగా జరిగిందని ఆయన సర్టిఫికెట్ ఇచ్చారనే అనుకోవాలి.

ఇంటి వద్దకే పెన్షన్ అనే విధానం బాగుంది కాబట్టి.. తిరిగి దాన్నే అమలు చేయాలనుకుంటున్నారు చంద్రబాబు. అయితే వాలంటీర్లను పక్కనపెట్టి సచివాలయ ఉద్యోగులకు ఆ బాధ్యతలు అప్పగించడం విశేషం. పెన్షన్ ఇచ్చేది ఎవరైనా, ఇంటి వద్దకు వచ్చి ఇవ్వడం అనేది జగన్ ప్రవేశ పెట్టిన విధానమే. దాన్ని కొనసాగించడం అంటే జగన్ విధానాన్ని చంద్రబాబు కూడా ఆమోదించారని అనుకోవాలి. అదే ఇప్పుడు జరుగుతోంది. కానీ పెన్షన్ల పెంపు నామమాత్రంగా ఉంటుందని జగన్ తన మేనిఫెస్టోలో ప్రకటించారు, అది కూడా ఐదేళ్లపాటు పెంచుకుంటూ పోతానని మాత్రమే చెప్పారు. కానీ చంద్రబాబు మాత్రం అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.4వేలు పెన్షన్ ఇస్తానని భారీ హామీ ఇచ్చారు. అందుకే జనం పెద్దహామీకే మద్దతిచ్చారు. జులై-1న బకాయిలతో కలిపి ఏకమొత్తంగా రూ.7వేలు అందుకోబోతున్నారు. 

Tags:    
Advertisement

Similar News