చంద్రబాబు దూకుడు.. ముందస్తుగా అభ్యర్థుల ప్రకటన
షెడ్యూల్ ప్రకారం ఎన్నికలకు సుమారు 9 నెలలు సమయం ఉంది. ఇప్పటి నుంచే టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జిల పేరుతో అభ్యర్థుల్ని ప్రకటించేస్తున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు తన శైలికి భిన్నంగా చాలా దూకుడుగా ఉన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక కూడా అభ్యర్థుల్ని తేల్చకుండా సమీకరణాలు, సర్వేలంటూ నాన్చేవారని ఆయనపై పార్టీ నేతలే అపవాదు వేసేవారు. 2019 ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలయ్యాక చాలా నియోజకవర్గాల అభ్యర్థుల్ని ఫైనల్ చేసిన చంద్రబాబు.. ఈసారి మాత్రం చాలా స్పీడుగా అభ్యర్థుల్ని ఎంపిక చేసేస్తున్నారు.
షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగేందుకు సుమారు 9 నెలలు సమయం ఉంది. ఇప్పటి నుంచే టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జిల పేరుతో అభ్యర్థుల్ని ప్రకటించేస్తున్నారు. తీవ్రవిభేదాలు, పొత్తులో తప్పనిసరై కేటాయించాల్సి వస్తుందనుకున్న సీట్లు తప్పించి మిగిలిన అన్ని స్థానాలకీ వరసపెట్టి నియోజకవర్గ ఇన్చార్జిలను ప్రకటించేస్తున్నారు. అనూహ్యమైన పరిస్థితులు ఎదురుకాకపోతే టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జిలే అభ్యర్థులుగా బరిలో దిగుతారు.
వైసీపీ నుంచి ఇటీవలే టీడీపీలో చేరిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని అదే నియోజకవర్గ ఇన్చార్జిగా ప్రకటించారు. నెల్లూరు సిటీకి మాజీ మంత్రి పొంగూరు నారాయణకి బాధ్యతలు అప్పగించారు. నందిగామ నుంచి తంగిరాల సౌమ్య బరిలో ఉంటారని అందరూ సహకరించాలని చంద్రబాబే స్పష్టం చేశారు. రాజానగరం టీడీపీ ఇన్చార్జి కోసం తీవ్రమైన పోటీ ఉన్నా.. ధైర్యంగా బొడ్డు వెంకటరమణ చౌదరిని బరిలో దింపుతున్నామని స్పష్టంచేశారు.
యువగళం పాదయాత్రలో నారా లోకేష్ కూడా నియోజకవర్గాలలో జరిగే బహిరంగసభలలో చాలా వరకూ అభ్యర్థుల్ని గెలిపించాలని వారిని వేదికనుంచే ప్రజలకి పరిచయం చేస్తున్నారు. తండ్రి కేంద్ర కార్యాలయం నుంచి నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేసుకుంటూ అభ్యర్థుల్ని ప్రకటిస్తుంటే.. తండ్రి సూచనలతో యువగళం పాదయాత్రలో తనయుడు మరికొందరు అభ్యర్థుల పేర్లు వెల్లడిస్తున్నారు.
పార్టీ సీనియర్ నేతలు, కోర్ సభ్యులు పోటీచేసే స్థానాలు ఎలాగూ మారవు. మిగిలిన చోట్ల నేతలు, కార్యకర్తల్లో గందరగోళం కొనసాగించడంతో నష్టం జరుగుతోందని గుర్తించిన టీడీపీ అధిష్టానం ఎన్నికలకు చాలా సమయం ఉండగానే అభ్యర్థులని ప్రకటించేస్తున్నారని తెలుస్తోంది.