నేడు ఢిల్లీకి బాబు, పవన్.. పొత్తుపై బీజేపీని బతిమాలుకోవడానికే..!
అమిత్ షాతో ఢిల్లీలో భేటీకి సన్నాహకంగా నిన్న పవన్, బాబు సమావేశమయ్యారు. ఉండవల్లిలో చంద్రబాబు ఇంటికెళ్లిన జనసేనాని దాదాపు గంటన్నరసేపు ఉన్నారు.
తెలుగుదేశం, జనసేన కూటమి కట్టినా అనుకున్నంత ఊపు రాక ఢీలా పడుతున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మరోవైపు పెద్దన్న బీజేపీ కలిసొస్తుందో.. లేదో, తెలియక తెగ టెన్షన్ పడుతున్నారు. జగన్ ప్రజాదరణ ముందు తేలిపోకుండా ఉండాలంటే కేంద్రం మద్దతు అవసరమని వాళ్లకు బాగా తెలుసు. అందుకే బీజేపీ పెద్దలు బాబ్బాబూ కలిసి పోటీ చేద్దాం అని బతిమాలుకోవడానికి బాబు, పవన్ ఈ రోజు ఢిల్లీ వెళుతున్నారు.
ఎలాగైనా ఒప్పించాలి గురూ
అమిత్ షాతో ఢిల్లీలో భేటీకి సన్నాహకంగా నిన్న పవన్, బాబు సమావేశమయ్యారు. ఉండవల్లిలో చంద్రబాబు ఇంటికెళ్లిన జనసేనాని దాదాపు గంటన్నరసేపు ఉన్నారు. ప్రధానంగా తమతో పొత్తుకు బీజేపీని ఎలా ఒప్పించాలి, అమిత్‌షాకు ఏం చెప్పాలనేదే వారి మధ్య చర్చకు వచ్చిన అంశమని అందరికీ తెలుసు. పొత్తు మాకేం అక్కర్లేదన్నట్లు వ్యవహరిస్తున్న కమలదళాధిపతుల్ని ఎలా ఒప్పించాలన్న దానిపై బాబు ఎంత బుర్రబద్దలుగొట్టుకున్నా ఉపాయం తోచట్లేదని సమాచారం.
అమిత్ షా ఏమంటారో?
గత నెలలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను చంద్రబాబు కలిశారు. ఇంకేముంది పొత్తుకు బీజేపీ ఓకే అందన్నట్లు బాబు సిగ్నల్స్ ఇచ్చేశారు. అయితే ఎన్డీయే భాగస్వామ్యపక్షాలు పాత, కొత్తవాళ్లందర్నీ కలుస్తున్నాం తప్ప బాబును కలవడంలో స్పెషల్ ఏమీ లేదన్నట్లు బీజేపీ చెప్పుకొచ్చింది. అయినా పొత్తుపై ఆశ చావని బాబు, పవన్ ముందు జాగ్రత్తగా.. బీజేపీ అడుగుతుందనుకున్న సీట్లు పక్కనపెట్టి మరీ స్థానాలు ప్రకటించారు. ఈ నేపథ్యంలో వీరిద్దరూ కలిసి ఈ రోజు అమిత్‌షాతో భేటీ అవబోతున్నారు. అమిత్‌షా ఏమంటారోనన్నది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది.