చావు తెలివితో టీడీపీ గావుకేకలు..!
జగన్ని విలన్ అన్నవాళ్లు అతన్నే అనుసరించి ఆర్థిక సహాయం చేస్తాం అనడం కంటే సిగ్గుమాలిన పని ఏముంటుంది..?
ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి తెలుగుదేశం పార్టీ పురచేతిలో స్వర్గం చూపిస్తోంది. పేదలకు బంపర్ ఆఫర్ ఇస్తూ, దానికి సూపర్ సిక్స్ అని పేరుపెట్టింది.
1. రేపు ఎన్నికల్లో అధికారంలోకి వచ్చాక ఐదేళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాం. ఆలోగా యువతీ యువకులైన నిరుద్యోగులందరికీ నెలకి మూడు వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తాము.
2. ప్రతి స్కూలు విద్యార్థి కుటుంబానికీ ఏడాదికి రూ.15 వేలు ఇస్తాము. ఇద్దరు విద్యార్థులు ఉంటే రూ.30 వేలు, ముగ్గురు ఉంటే రూ.45 వేలు ఇవ్వనున్నాం.
3. ప్రతీ రైతు కుటుంబానికీ సంవత్సరానికి రూ.20 వేలు ఇస్తాము.
4. ప్రతీ కుటుంబానికీ మూడేసి గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాము.
5. 18–59 ఏళ్ల వయసు ఉన్న మహిళలు అందరికీ నెలనెలా రూ. 15 వందలు ఇవ్వనున్నాము.
6. అలాగే మహిళలందరికీ ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పిస్తాము.. అని చంద్రబాబు కుమారుడు లోకేష్ బహిరంగ సభల్లో గావుకేకలు పెడుతూ చెబుతున్నారు.
ఇవన్నీ సంక్షేమ పథకాలే కదా. ఇప్పటికే అన్ని రకాల పేదలకూ, దిగువ మధ్యతరగతి వాళ్లకీ జగన్మోహన్‌రెడ్డి నేరుగా ఇంటికే నగదు పంపిస్తూ జనాదరణ పొందివున్నారు. జగన్ చేసేవన్నీ పాడుపనులు, రాష్ట్రాన్ని తగలబెట్టేశాడు అని ప్రచారం చేస్తున్న బాబు, లోకేష్ ఇప్పుడు ఆ జగన్ అనే ‘సైకో’నే కాపీ కొడుతున్నారుగా..! జగన్ని విలన్ అన్నవాళ్లు అతన్నే అనుసరించి ఆర్థిక సహాయం చేస్తాం అనడం కంటే సిగ్గుమాలిన పని ఏముంటుంది..?
మరో పాయింటు ఏమంటే.. జగన్ లక్షల కోట్ల అప్పులు చేశాడు. రాష్ట్రాన్ని దివాలా తీయించాడు. అభివృద్ధి అడ్రస్ లేకుండా పోయింది.. అని చెబుతున్న తెలుగుదేశం వాళ్లు, సూపర్ సిక్స్ వాగ్దానాలను ఎలా అమలు చేస్తారు..?
ఒకవేళ, చంద్రబాబు అధికారంలోకి వస్తే మబ్బుల్లోంచి ఏమన్నా బంగారు నాణేలు కురుస్తాయా..? ఆకాశం నుంచి నోట్ల కట్టలు నేలరాలుతాయా..? మరి పంచడానికి బాబుగారు ఎక్కడి నుంచి డబ్బులు తెస్తారు. మళ్లీ అప్పులే చేస్తారు..? అసలు చంద్రబాబు 2014 నుంచి 2019 దాకా అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు సంక్షేమ పథకాలు అవసరం అనీ, నేరుగా నగదు ఇవ్వాలనీ తోచలేదా..? జగన్ ప్రజలను ఆదుకుంటున్న తీరు చూసి బాబుకి ఇప్పుడు జనం అవసరాలు గుర్తుకొచ్చాయా..? గత ఎన్నికల్లో చావుదెబ్బతిని కేవలం 23 సీట్లతో కుదేలైపోతేనే గానీ పేదజనం అంటే ఏమిటో అర్థం కాలేదా..? హెరిటేజ్, రియల్ ఎస్టేట్ అనే సొంత వ్యాపారాలు తప్ప, మరింకేమీ పట్టని చంద్రబాబుకి ఆలస్యంగానైనా జనం గుర్తుకు రావడం సంతోషించదగ్గదే..!