అప్పుల పేరెత్తిన చంద్రబాబు.. కాలయాపనకేనా..?

గత ప్రభుత్వం అది చేసింది, ఇది చేసింది, అందుకే మేం ముందుకెళ్లలేకపోతున్నామంటున్న చంద్రబాబు, ఆ సాకుతో కొత్త పథకాలు అమలు చేయకుండా కనీసం ఏడాదయినా కాలయాపన చేసే అవకాశముంది.

Advertisement
Update:2024-06-06 07:03 IST

కూటమి విజయం తర్వాత చంద్రబాబు గత ప్రభుత్వ అప్పుల గురించి ప్రముఖంగా ప్రస్తావించండం విశేషం. ఐదేళ్ల పాలనలో వైసీపీ ప్రభుత్వం ఎన్నో కుంభకోణాలు చేసిందని, లక్షల కోట్లు అప్పులు చేసిందని, లోతుకు వెళ్తేకానీ విషయం తెలియదని అన్నారాయన. మీడియాకు, విపక్షాలకు ఆ అప్పులు, కుంభకోణాల గురించి తెలిసింది చాలా తక్కువ అని, అసలు విషయం లోతుల్లోకి వెళ్లి శోధిస్తేనే అర్థమవుతుందన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన నాలుగైదురోజుల్లో అన్నీ బయటకు తీస్తామని చెప్పారు చంద్రబాబు.

శ్వేతపత్రాల ప్రస్తావన ఉంటుందా..?

తెలంగాణలో బీఆర్ఎస్ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కూడా ఇలాగే గత ప్రభుత్వంపై అప్పుల నిందలు వేసింది. ఖజానా ఖాళీగా ఉందని, ఏ పథకం అమలు చేయాలన్నా డబ్బులు లేవని, అదంతా బీఆర్ఎస్ పాపమేనని చెప్పుకొచ్చింది. శ్వేతపత్రాల పేరుతో కాలయాపన చేసింది. ఇప్పుడు ఏపీలో కూడా అదే పరిస్థితి రిపీట్ అవుతుందా అనే అనుమానాలున్నాయి. గత ప్రభుత్వం అది చేసింది, ఇది చేసింది, అందుకే మేం ముందుకెళ్లలేకపోతున్నామంటున్న చంద్రబాబు, ఆ సాకుతో కొత్త పథకాలు అమలు చేయకుండా కనీసం ఏడాదయినా కాలయాపన చేసే అవకాశముంది. అందుకే ఆయన తొలిసారిగా మీడియా ముందుకొచ్చి అప్పుల గురించి మాట్లాడారని తెలుస్తోంది.

30 ఏళ్లకు సరిపడా విధ్వంసం ఈ ఐదేళ్లలోనే ఏపీలో జరిగిందని, వ్యవస్థలన్నీ నాశనమయ్యాయని, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని, అప్పులు ఎంత చేశారో, ఎక్కడెక్కడ చేశారో, ఏయే పేర్లతో చేశారో లోతుల్లోకి వెళితే గానీ తెలియదంటున్నారు చంద్రబాబు. సంబంధంలేని వ్యవస్థతో డబ్బులు తెచ్చి, అసలు సంబంధంలేని మరో విభాగానికి ఇచ్చారన్నారు. మరి ఈ నిందలన్నిటినీ వైసీపీ మౌనంగా భరిస్తుందా లేదా అనేది చూడాలి. మొత్తమ్మీద చంద్రబాబు ఆర్థిక వ్యవహారాలను హైలైట్ చేస్తూ మాట్లాడారు కాబట్టి, దాని పరమార్థం కచ్చితంగా ఏదో ఒకటి ఉంటుందనే అంచనాలున్నాయి. 

Tags:    
Advertisement

Similar News