రోబో 2.ఓ కాదు.. బాబు 4.ఓ
జగన్ ముఖ్యమంత్రిగా పనికిరాడని ప్రజలు తీర్పు ఇచ్చారని, ప్రజల అభీష్టం మేరకు సీఎం అంటే ఇలా ఉండాలి అని తాను నిరూపిస్తానని చెప్పారు చంద్రబాబు.
గత వైసీపీ పాలనను పూర్తిగా మరచిపోవాలని, ఆ అలవాట్లను వదిలేసుకోవాలని అధికారులకు చురకలంటించారు సీఎం చంద్రబాబు. పరదాలు కట్టే అలవాటు ఉంటే వారిని సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. ఐదేళ్లపాటు ఆ పాలనకు అలవాటు పడ్డవాళ్లు మారాలంటే కాస్త కష్టమే కానీ, మారాల్సిందేనని తేల్చి చెప్పారు. రివర్స్ పాలన నుంచి బండి గాడిలో పడిందని, ఇక స్పీడ్ పెంచాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో లాగా పాలన స్పీడ్ పెరగాలన్నారు చంద్రబాబు.
పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు.. గతాన్ని గుర్తు చేసుకున్నారు. 1995లో తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ నుంచి బయలుదేరుతున్నానంటే రాష్ట్రం మొత్తం రెడ్ అలర్ట్ ఉండేదని చెప్పారు. ఇప్పుడు అంత భయంకరంగా చేయకపోయినా పాలన విషయంలో కచ్చితంగా ఉంటానన్నారు. 95 సీబీఎన్ అంటే ఏంటో చూపిస్తానన్నారు బాబు.
షాక్ ట్రీట్ మెంట్ ఇస్తా..
అధికారులెవరైనా మారకపోతే వారికి షాక్ ట్రీట్ మెంట్ ఇస్తానని చెప్పారు సీఎం చంద్రబాబు. జగన్ ముఖ్యమంత్రిగా పనికిరాడని ప్రజలు తీర్పు ఇచ్చారని, ప్రజల అభీష్టం మేరకు సీఎం అంటే ఇలా ఉండాలి అని తాను నిరూపిస్తానని చెప్పారాయన. జగన్ పాలనలో రాష్ట్రం బ్రాండ్ దెబ్బతిన్నదన్నారు. గతంలో తాను ఎంతోమంది ముఖ్యమంత్రుల్ని చూశానని, కానీ సీఎంగా ఎలాంటి వ్యక్తి ఉండకూడదో.. అలాంటి వ్యక్తి పాలనలో ఐదేళ్లు గడిపామని వివరించారు. సీఎం వస్తుంటే మురికి కాల్వలు కనపడకుండా పరదాలు కట్టేవారని అలాంటి పరిస్థితులు ఇప్పుడు ఉండకూడదన్నారు. పరదాలు తీసేసి పారదర్శకమైన పాలన అందిస్తానన్నారు చంద్రబాబు.