అధికారులకు 100 డేస్ టార్గెట్ ఇచ్చిన చంద్రబాబు

తాము సాధించిన ఘనత గురించి చెప్పుకోవడంతోపాటు.. గత వైసీపీ పాలనలో 100 రోజుల్లో ఏం జరిగిందనే విషయాలను కూడా కూటమి ప్రభుత్వం ప్రజల ముందుకు తేబోతోంది.

Advertisement
Update:2024-08-26 14:49 IST

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సెప్టెంబర్ 22తో 100 రోజులు పూర్తవుతుంది. 100రోజుల్లో మార్పు చూపిస్తానంటూ ఇదివరకే సీఎం చంద్రబాబు ప్రకటించారు. మరి టైమ్ దగ్గరపడుతోంది. ఆలోగా ఏం మార్పులు సాధించామనేది ప్రజలకు చెప్పాలని, గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి తేడా చూపించాలని అధికారులకు టార్గెట్ ఫిక్స్ చేశారు సీఎం చంద్రబాబు. కూటమి ప్రభుత్వ 100రోజుల పాలన ఫలితాలు ప్రజలకు స్పష్టంగా తెలిసేలా చేయాలని చెప్పారాయన.

సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 5 కీలక ఫైళ్లపై సంతకాలు చేశారు చంద్రబాబు. అందులో పెన్షన్ల పెంపు మాత్రమే తక్షణం ప్రజలకు ఉపయోగపడింది. అన్న క్యాంటీన్ల వల్ల కేవలం కొంతమంది ప్రజలకు మాత్రమే లబ్ధి చేకూరుతోంది. స్కిలె సెన్సెస్ వల్ల ఏమేరకు ప్రయోజనం ఉందో తేలాల్సి ఉంది. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడింది కానీ పెద్దగా స్పందన లేదు. ఇక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు నిర్ణయాన్ని హైలైట్ చేయాలనుకున్నా కుదర్లేదు. రాగా పోగా పెన్షన్ల పెంపు మాత్రం చంద్రబాబుకి, కూటమి ప్రభుత్వానికి ప్లస్ అయింది. వీటితోపాటు ఉచిత ఇసుక విధానం కూడా తెరపైకి వచ్చినా దానిపై విమర్శలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. పంచాయతీలకు నిధులు విడుదల, కేంద్ర బడ్జెట్ లో ఏపీకి కేటాయింపులు, ఏపీకి తరలి వస్తున్నాయని చెబుతున్న కంపెనీలు.. ఇదంతా తమ 100 రోజుల ఘనతేనని చెప్పుకోబోతున్నారు సీఎం చంద్రబాబు.

ఏపీలో గంజాయి, డ్రగ్స్‌ నియంత్రణ, రాజధాని అమరావతిపై స్పెషల్‌ ఫోకస్‌, విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌కు యుద్ధ ప్రాతిపదికన భూమి కేటాయింపు, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పునరుద్ధరణ, ఎంఎస్ఎంఈ సెక్టార్లలో ఇన్సెంటివ్స్ ప్రకటన లాంటి అంశాలను కూటమి ప్రభుత్వ విజయాలుగా చెప్పబోతున్నారు. రాష్ట్రంలోని 13,326 గ్రామపంచాయతీల్లో ఇప్పటికే గ్రామ సభలు పూర్తి చేసి ఉపాధి పనుల తీర్మానాలు కంప్లీట్‌ చేశారు. ఇవన్నీ 100 రోజుల కూటమి పాలన ఘనతేనంటున్నారు.

తాము సాధించిన ఘనత గురించి చెప్పుకోవడంతోపాటు.. గత వైసీపీ పాలనలో 100 రోజుల్లో ఏం జరిగిందనే విషయాలను కూడా కూటమి ప్రభుత్వం ప్రజల ముందుకు తేబోతోంది. వైసీపీ హయాంలో కొత్త పథకాలేవీ 100 రోజుల్లోపు మొదలు కాలేదని, అన్నిటినీ నిదానంగా ప్రారంభించారని, కొన్నిటిని ఆరు నెలల తర్వాత మొదలు పెట్టారని, మరికొన్నిటిని ఏడాది తర్వాత పట్టాలెక్కించారని అంటున్నారు. అప్పట్లో ఆలస్యమైనా, ఇప్పుడు 100 రోజుల్లో వీలైనన్ని ఎక్కువ పనులు చేసినట్టు చెప్పుకోవాలనుకుంటున్నారు సీఎం చంద్రబాబు. సాధికారికంగా అధికారులతోనే ప్రభుత్వ విజయాలను ప్రచారం చేయించబోతున్నారు. 

Tags:    
Advertisement

Similar News