విశాఖ ఉక్కు ఆస్తుల విక్రయానికి ప్రకటన
ఆస్తులతో వచ్చిన సొమ్ము కొద్దిరోజులకు సరిపోతుందని.. ఆ తర్వాత మళ్లీ ఇతర ఆస్తులు అమ్మాల్సి వస్తుందని.. ఇది శాశ్వత పరిష్కారం కానేకాదంటున్నారు.
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని విక్రయించే మార్గాన్ని మెల్లగా ఏర్పాటు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఎవరెన్ని అభ్యంతరాలు తెలిపినా, ఆందోళన చేసినా మాట వినే పరిస్థితి కనిపించడం లేదు. విశాఖ ఉక్కు పరిశ్రమ ఆస్తుల విక్రయాన్ని యాజమాన్యం మొదలుపెట్టింది.
విశాఖ హెచ్‌బీ కాలనీలోని 22.9 ఎకరాల్లో ఉన్న 588 క్వార్టర్లను అమ్మేందుకు ప్లాంట్ పరిపాలన విభాగం నుంచి ప్రకటన జారీ అయింది. ఆటోనగర్‌లోని 2 ఎకరాల పరిధిలో ఉన్న 76 ఇళ్లను కూడా విక్రయిస్తామని ప్రకటనలో తెలిపింది. ఈ ఆస్తులను కొనుగోలు చేసేందుకు ఆసక్తిగా ఉన్నవారిని ఆహ్వానిస్తూ ప్రకటనిచ్చింది. ఆస్తులను విడివిడిగా గానీ, మొత్తంగా గానీ కొనుగోలు చేసేందుకు వీలు కల్పిస్తున్నారు. విశాఖ పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థలు ఈ ఆస్తులను కొనాలనుకుంటే ఆసక్తి వ్యక్తం చేస్తూ లేఖలు ఇవ్వాలని కోరారు.
హెచ్‌బీ కాలనీలోని అమ్మకానికి పెడుతున్న 22.9 ఎకరాల భూమి విలువ దాదాపు 15వందల కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఆటోనగర్‌లోని రెండు ఎకరాలు భూమి విలువ వంద కోట్ల వరకు ఉంటుందని చెబుతున్నారు. ఆస్తులు అమ్మగా వచ్చిన సొమ్ముతో ప్లాంట్‌ను నిర్వహిస్తామని యాజమాన్యం చెబుతోంది. అయితే ఈప్రయత్నం వల్ల ఉపయోగం లేదని కార్మిక సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. ఆస్తులతో వచ్చిన సొమ్ము కొద్దిరోజులకు సరిపోతుందని.. ఆ తర్వాత మళ్లీ ఇతర ఆస్తులు అమ్మాల్సి వస్తుందని.. ఇది శాశ్వత పరిష్కారం కానేకాదంటున్నారు.
విలువైన ఆస్తులను కార్పొరేట్ శక్తులకు అప్పగించేందుకు ప్రయత్నిస్తున్నారని కార్మికులు ఆరోపిస్తున్నారు. కావాలంటే విశాఖ ఉక్కు భూములను కేంద్రం తన అధీనంలో ఉంచుకుని సున్నావడ్డీకి రుణసాయం అందిస్తే ప్లాంటు నిలదొక్కుకునే అవకాశం ఉందంటున్నారు. సున్నా వడ్డీతో 20వేల కోట్ల రుణం ఇస్తే పదేళ్లలోనే తిరిగి చెల్లిస్తామని విశాఖ ఉక్కు నుంచి ప్రతిపాదన పెట్టినా కేంద్రం తిరస్కరించిందని విమర్శిస్తున్నారు.