ఏపీలో ఎలక్షన్ హీట్.. కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన
ఏపీలో ఓటర్ల జాబితా, నకిలీ ఓట్ల అంశం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఉద్దేశపూర్వకంగా ఓట్ల తొలగింపు కూడా జరుగుతోంది. కారణం మీరంటే మీరంటూ ప్రధాన పార్టీలు ఒకదానిపై మరొకటి ఆరోపణలు చేసుకుంటున్నాయి.
ఏపీలో వైసీపీ, టీడీపీ, జనసేన నాయకుల స్టేట్ మెంట్లతో ఇప్పటికే పొలిటికల్ హీట్ పెరిగిపోయింది. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం పర్యటనతో ఎలక్షన్ హీట్ కూడా పెరిగింది. కేంద్ర ఎన్నికల సంఘం బృందం ఏపీకి వచ్చింది. ఈరోజు, రేపు వారు రాష్ట్ర అధికారులతో చర్చలు జరుపుతారు. రాష్ట్రంలో ఎన్నికల సన్నద్ధతపై చర్చిస్తారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డీజీపీతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఉన్నతాధికారులతో కేంద్ర ఎన్నికల బృందం సమీక్ష నిర్వహిస్తుంది. రాష్ట్రంలోని ఓటర్ల జాబితాల్లో అక్రమాలు, అవకతవకలు, లోపాలపై అధికార-ప్రతిపక్ష పార్టీలు ఇచ్చిన ఫిర్యాదులపై కూడా సమీక్ష చేపట్టే అవకాశముంది.
సార్వత్రిక ఎన్నికలతోపాటు ఏపీలో కూడా అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఏపీలో ఎన్నికల ప్రక్రియ మొదలుపెట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టింది. రెండు రోజుల సమీక్ష కోసం సీఈసీ అధికారుల బృందం రాష్ట్రానికి విచ్చేసింది. ఏపీలో ఎన్నికల సన్నద్ధత, ఓటర్ జాబితా సవరణ-2024తో పాటు రాబోయే శాసనసభ, లోక్‌సభ ఎన్నికల సన్నద్ధత తదితర అంశాలపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో నేడు, రేపు సమీక్ష నిర్వహిస్తుంది. కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు ఈ సమీక్షకు హాజరవుతారు. విజయవాడలోని నోవాటెల్ లో నేడు, రేపు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో రాష్ట్ర అధికారులు సమావేశమవుతారు. జిల్లాల వారీగా ఓటర్ల జాబితా తయారీ తదితర అంశాలపై నివేదికల ఆధారంగా చర్చలు జరుపుతారు. ఎన్నికల నిర్వహణ ప్రక్రియపై కలెక్టర్ల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనంతరం, 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్రంలోని అంశాలపై చర్చిస్తారు.
ఆరోపణలు, ప్రత్యారోపణలు..
ఏపీలో ఓటర్ల జాబితా, నకిలీ ఓట్ల అంశం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఉద్దేశపూర్వకంగా ఓట్ల తొలగింపు కూడా జరుగుతోంది. అయితే ఈ తప్పులకు కారణం మీరంటే మీరంటూ ప్రధాన పార్టీలు ఒకదానిపై మరొకటి ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఏకంగా పార్లమెంట్ లో కూడా నకిలీ ఓట్ల అంశాన్ని లేవనెత్తారు టీడీపీ నేతలు. ఏపీలో ఓటర్ల జాబితా తయారీలో పెద్దఎత్తున అవకతవకలు జరుగుతున్నాయని లోక్ సభలో ఆరోపించారు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్. జాబితాలో సవరణల కోసం ఇప్పటివరకు 23 లక్షల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని, వాటన్నింటినీ పరీక్షించిన తర్వాతే తుది జాబితా వెలువరించాలని కోరారు. ఈ ఆరోపణలు, ప్రత్యారోపణలన్నిటిపై ఈసీ దృష్టి సారించే అవకాశముంది.