గోవిందా.. గోవిందా.. కొండమీద సెల్ ఫోన్ తో అపచారం
శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించే సమయంలోనే దాదాపు మూడు చోట్ల భక్తుల్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. ప్రధాన ఆలయంలోకి ప్రవేశించడానికి ముందే సెల్ ఫోన్ తీసి పక్కనపెట్టాల్సి ఉంటుంది.
తిరుమల కొండపై సెల్ ఫోన్ తో ఏదయినా రికార్డ్ చేయొచ్చా..? ఎక్కడ పడితే అక్కడికి సెల్ ఫోన్ తీసుకెళ్తామంటే కుదరదు. కెమెరాతో షూటింగ్ మొదలు పెడతామంటే అస్సలు వీలుకాదు. కానీ ఇటీవల జరుగుతున్న సంఘటనలు మాత్రం తిరుమలలో జరుగుతున్న అపచారాలను బయటపెడుతున్నాయి. తాజాగా ఓ భక్తుడు ఆనంద నిలయాన్ని సెల్ ఫోన్ తో చిత్రీకరించడం, ఆ వీడియోలు సోషల్ మీడియాలో బయటకు రావడంతో కలకలం రేగింది. ఆనంద నిలయంలోని దృశ్యాలను, ఇతర ఉపాలయాలను సెల్ ఫోన్ లో చిత్రీకరించాడు ఆ భక్తుడు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. అవి వైరల్ గా మారాయి. తిరుమలలో మరోసారి భద్రతా లోపం బయటపడినట్టయింది. సెల్ ఫోన్ తో ప్రధాన ఆలయంలోకి ప్రవేశిస్తేనే ఇలాంటి వీడియోలు రికార్డ్ చేసే అవకాశముంది. దీనికి బాధ్యులెవరనే విషయంపై టీటీడీలో విచారణ మొదలైంది.
శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించే సమయంలోనే దాదాపు మూడు చోట్ల భక్తుల్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. మెటల్ డిటెక్టర్ తో కూడా తనిఖీ చేస్తారు ప్రధాన ఆలయంలోకి ప్రవేశించడానికి ముందే సెల్ ఫోన్ తీసి పక్కనపెట్టాల్సి ఉంటుంది. కానీ మూడు చోట్ల తనిఖీలను దాటుకుని ఆ భక్తుడు లోపలికి సెల్ ఫోన్ తీసుకెళ్లడం విశేషం. భద్రతా లోపంపై టీటీడీ విజిలెన్స్ అధికారి బాలిరెడ్డి స్పందించారు. సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నామని, సెల్ ఫోన్ తో చిత్రీకరించినది ఎవరో కనిపెడతామన్నారు.
ఆమధ్య తిరుమలలో డ్రోన్ కెమెరా కలకలం రేగింది. డ్రోన్లతో తిరుమల కొండపై చిత్రీకరణ చేస్తుండగా, తీసిన ఫొటోలు సంచలనంగా మారాయి. దీనిపై టీటీడీ వివరణ ఇచ్చింది. ఆ తర్వాత భారత వాయుసేనకు చెందిన హెలికాప్టర్లు తిరుమలకొండపైనుంచి వెళ్లడం కూడా సంచలనంగా మారింది. అసలు తిరుమల నో ఫ్లయింగ్ జోనా కాదా అనే చర్చ మొదలైంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, నేరుగా సెల్ ఫోన్ ని తిరుమల ఆలయంలోకి తీసుకెళ్లి వీడియోలు తీయడం మరో ఎత్తు. దీనిపై భక్తులు మండిపడుతున్నారు. తిరుమలలో నిఘా వైఫల్యం బయటపడిందని అంటున్నారు. కొండపైకి ప్లాస్టిక్ బాటిళ్లు తీసుకెళ్లకుండా అడ్డుకుంటున్నామంటూ గొప్పలు చెప్పుకుంటున్న టీటీడీ.. అసలు గుడిలోకి సెల్ ఫోన్ తీసుకెళ్తే ఏం చేస్తోందంటూ మండిపడుతున్నారు భక్తులు.