రహస్య సాక్షి చెప్పిందాంట్లో కొత్తేముంది?

సీబీఐ చెప్పిన రహస్య సాక్షి ఎవరంటే కొమ్మా శివచంద్రారెడ్డి. ఆయన ఒకప్పుడు వైసీపీ నేత, వివేకాకు అత్యంత సన్నిహితుల్లో ఒకరు. ఇంతకీ ఆయన చెప్పిన సాక్ష్యం ఏమిటంటే .. జమ్మలమడుగు ఎమ్మెల్యేగా అవినాష్ రెడ్డి పోటీ చేస్తారని చెప్పారట.

Advertisement
Update:2023-07-25 11:06 IST

వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో సీబీఐ వైఖరి చాలా విచిత్రంగా ఉంది. హత్య కేసులో ఒక రహస్య సాక్షి ఉన్నారని సమయం వచ్చినప్పుడు ప్రవేశపెడతామని ఇంతకాలం కోర్టులో సీబీఐ చెబుతూ వచ్చింది. తీరా రహస్య సాక్షి ఇచ్చిన వాంగ్మూలం చూస్తే అందులో కొత్తదనం ఏమీ కనబడలేదు. ఇంతోటిదానికి వివేకా హత్యలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి పాత్ర ఉందని చెప్పటానికి తమ దగ్గర బ్రహ్మాస్త్రం ఉందన్నట్లుగా సీబీఐ ఇచ్చిన బిల్డప్ విచిత్రంగా ఉంది.

ఇంతకీ సీబీఐ చెప్పిన రహస్య సాక్షి ఎవరంటే.. కొమ్మా శివచంద్రారెడ్డి. ఆయన ఒకప్పుడు వైసీపీ నేత, వివేకాకు అత్యంత సన్నిహితుల్లో ఒకరు. ఇంతకీ ఆయన చెప్పిన సాక్ష్యం ఏమిటంటే .. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఒక రోజు వివేకా ఆయ‌న వ‌ద్ద‌కు వెళ్లి జమ్మలమడుగు ఎమ్మెల్యేగా అవినాష్ రెడ్డి పోటీ చేస్తారని చెప్పారట. కడప ఎంపీగా విజయమ్మ లేదా షర్మిల పోటీలోకి దిగుతారని చెప్పారట. ఇందులో కీలకం ఏముందో అర్థంకావటంలేదు.

ఎవరు ఎక్కడ పోటీ చేయాలో డిసైడ్ చేయాల్సింది జగన్మోహన్ రెడ్డే కానీ వివేకా కాదు. ఎందుకంటే పార్టీకి జగన్ మెయిన్ వివేకా కేవలం ఒక గెస్ట్ క్యారెక్టరంతే. టికెట్లు డిసైడ్ చేసేది జగనే అని తెలిసినా తనకు లేని అధికారాన్ని, పెద్దరికాన్ని వివేకా తన చేతుల్లోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. పైగా సిట్టింగ్ ఎంపీ హోదాలో అప్పటికే అవినాష్ అభ్యర్థిత్వాన్ని జగన్ ప్రకటించేశారు. అవినాష్ గెలుపు కోసం వివేకా ప్రచారం చేస్తున్నారు. ఒకవైపు అవినాష్ గెలుపున‌కు ప్రచారం చేస్తు మరోవైపు అవినాష్ ఎంపీగా కాదు జమ్మలమడుగు ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని వివేకా చెప్పటం ఏమిటి?

బెంగళూరులో తన దగ్గరకు చిన్నాన్న వివేకా వచ్చి కడప ఎంపీగా పోటీ చేయాలని గట్టిగా ఒత్తిడి తెచ్చారని షర్మిల చాలాసార్లు చెప్పారు. వివేకా ఎంతచెప్పినా తాను ఒప్పుకోలేదని కూడా అన్నారు. ఇదంతా చూసిన తర్వాత పార్టీలో తనకు లేని పెద్దరికాన్ని వివేకా భుజాన వేసుకున్నట్లు స్పష్టమవుతోంది. సీబీఐ చెప్పిన రహస్య సాక్షి చెప్పిందాంట్లో కొత్తదనం ఏముంది? హత్య కేసులో అవినాష్ పాత్రను నిరూపించే సాక్ష్యం ఏముందో అర్థంకావటంలేదు.

Tags:    
Advertisement

Similar News