ఆగస్ట్ 14న కోర్టుకి రావాలి.. అవినాష్ రెడ్డికి సమన్లు
అవినాష్ రెడ్డి మాత్రం ప్రస్తుతం ముందస్తు బెయిల్ పై ఉన్నారు. ఆయన్ను కూడా ఆగస్ట్ 14న జరిగే విచారణకు రావాలంటూ కోర్టు సమన్లు జారీ చేసింది.
వైఎస్ వివేకా హత్యకేసు విచారణలో భాగంగా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసింది. ఆగస్ట్ 14న ఆయన సీబీఐ కోర్టులో జరిగే విచారణకు హాజరు కావాలని చెప్పింది. ఆయన కోర్టుకు వచ్చే విధంగా చూడాల్సిన బాధ్యత సీబీఐకే అప్పగించింది న్యాయస్థానం.
సీబీఐ కోర్టులో విచారణ..
వైఎస్ వివేకా హత్యకేసుకి సంబంధించి ఈరోజు సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. చంచల్ గూడ జైలులో ఉన్న నిందితులందరూ విచారణకు హాజరయ్యారు. వారందరికీ ఆగస్టు 14 వరకు కోర్టు రిమాండ్ పొడిగించింది. ఇందులో అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి కూడా ఉన్నారు. అవినాష్ రెడ్డి మాత్రం ప్రస్తుతం ముందస్తు బెయిల్ పై ఉన్నారు. ఆయన్ను కూడా ఆగస్ట్ 14న జరిగే విచారణకు రావాలంటూ కోర్టు సమన్లు జారీ చేసింది.
వివేకా హత్యకేసులో సీబీఐ ఇటీవల అనుబంధ చార్జిషీట్ దాఖలు చేసింది. అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిపై ఇటీవల ఈ అనుబంధ చార్జిషీట్ దాఖలు చేసింది సీబీఐ. ఇందులో అవినాష్ రెడ్డిని ఎనిమిదో నిందితుడుగా చేర్చింది. దీనిని కోర్టు పరిగణలోకి తీసుకుంది. అవినాష్ రెడ్డి విచారణకు హాజరు కావాలని చెప్పింది.