విదేశాలకు వెళ్లేందుకు జగన్, విజయసాయికి సీబీఐ కోర్టు అనుమతి

సెప్టెంబర్ 2న వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతి సందర్భంగా సీఎం జగన్ ఇడుపులపాయకు వెళ్తారు. సెప్టెంబర్ 2 మధ్యాహ్నం తిరిగి తాడేపల్లికి చేరుకుంటారు. అదే రోజు సాయంత్రం డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడు కుమారుడి వివాహానికి హాజరవుతారు. రాత్రికి ఆయన లండన్ బయలుదేరి వెళ్తారు.

Advertisement
Update:2023-08-31 17:50 IST

విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ సీబీఐ కోర్టుని అనుమతి కోరారు సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి. వారి అభ్యర్థనపై బుధవారం వాదనలు పూర్తయ్యాయి. ఈరోజు సీబీఐ కోర్టు తీర్పు వెలువరించింది. వారిద్దరికీ విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది.

సెప్టెంబర్ 2న లండన్‌ లోని తన కుమార్తె వద్దకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీఎం జగన్ సీబీఐ కోర్టుని కోరారు. దేశం విడిచి వెళ్లరాదన్న బెయిల్‌ షరతులను సడలించాలని కోరారు. ఆయన అభ్యర్థన పరిశీలించిన కోర్టు అనుమతి మంజూరు చేసింది. సెప్టెంబర్‌ 2 నుంచి 12 రోజుల పాటు జగన్ లండన్ లో ఉంటారు. సెప్టెంబర్ 2న వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతి సందర్భంగా సీఎం జగన్ ఇడుపులపాయకు వెళ్తారు. సెప్టెంబర్ 2 మధ్యాహ్నం తిరిగి తాడేపల్లికి చేరుకుంటారు. అదే రోజు సాయంత్రం డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడు కుమారుడి వివాహానికి హాజరవుతారు. రాత్రికి ఆయన లండన్ బయలుదేరి వెళ్తారు.

విజయసాయికి కూడా అనుమతి

మరోవైపు విదేశాల్లోని వివిధ యూనివర్సిటీలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకోవాలని, దానికోసం తన విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టుని కోరారు ఎంపీ విజయసాయిరెడ్డి. ఆయనకు కూడా కోర్టు అనుమతి ఇచ్చింది. యూకే, యూఎస్, జర్మనీ, దుబాయ్, సింగపూర్ వెళ్లేందుకు విజయసాయి కోర్టుని అనుమతి కోరారు. 

Tags:    
Advertisement

Similar News