డిసెంబర్ డెడ్ లైన్ పూర్తి.. విశాఖ పాలనపై మరో ఆసక్తికర కామెంట్

ఈ సారి వైవీ సుబ్బారెడ్డి డెడ్ లైన్ ఏదీ పెట్టలేదు. న్యాయస్థానాల పరిధిలో ఎదురవుతున్న సమస్యను అధిగమిస్తామని.. తప్పకుండా జగన్ విశాఖ నుంచి పాలన సాగిస్తారని ఆయన చెప్పారు.

Advertisement
Update:2023-12-28 14:35 IST

ఉగాది, దసరా, డిసెంబర్.. ఇలా విశాఖ రాజధానికి సంబంధించిన డెడ్ లైన్లు అన్నీ పూర్తయ్యాయి. సీఎం జగన్ ఎంత కాన్ఫిడెంట్ గా వచ్చేస్తున్నాం అని చెప్పినా జనం పూర్తిగా నమ్మేస్తారనుకోలేం. డిసెంబర్ నుంచి నా కాపురం అక్కడినుంచే అని చెప్పిన చివరి డెడ్ లైన్ కూడా మరో మూడు రోజుల్లో పూర్తవుతుంది. ఈ దశలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్ పై మరో ఆసక్తికర వాదన వినపడుతోంది. వైసీపీ ఉత్తరాంధ్ర ఇన్ చార్జ్ వైవీ సుబ్బారెడ్డి విశాఖ రాజధానిపై తాజాగా స్పందించారు. తప్పకుండా సీఎం జగన్ విశాఖ నుంచి పాలన మొదలు పెడతారని స్పష్టం చేశారాయన.

ఎప్పుడంటే..?

అయితే ఈ సారి మాత్రం వైవీ సుబ్బారెడ్డి డెడ్ లైన్ ఏదీ పెట్టలేదు. న్యాయస్థానాల పరిధిలో ఎదురవుతున్న ఇబ్బందుల వల్లే విశాఖపట్నం రాజధాని మార్పు ఆలస్యం అవుతోందని చెప్పారు వైవీ. ఈ సమస్యను అధిగమిస్తామని.. తప్పకుండా జగన్ విశాఖ నుంచి పాలన సాగిస్తారని ఆయన చెప్పారు.

ఎవరు వెళ్లినా మాకు ఇబ్బంది లేదు..

వైసీపీని విడిచిపెట్టి వెళ్తున్నవారితో తమకు ఇబ్బంది లేదన్నారు వైవీ సుబ్బారెడ్డి. ఎమ్మెల్సీ వంశీ కృష్ణ పార్టీ మారడంపై ఉత్తరాంధ్ర పార్టీ ఇన్ చార్జ్ గా ఆయన స్పందించారు. బీసీలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే పట్టుబట్టి వంశీకి ఎమ్మెల్సీ ఇప్పించామని, ఎమ్మెల్సీ పదవి ఇచ్చినా కూడా రాజీనామా చేసి వెళ్తున్నారంటే దానికి వారే సమాధానం చెప్పాలన్నారు. ఎక్కడైతే మార్పు అవసరమని భావించామో అక్కడే ఇన్ చార్జిలను మారుస్తున్నామన్నారు. స్థానిక నాయకులు కొత్తవాళ్లకు సహకరించాలని సీఎం జగన్‌ కూడా చెప్పారని వివరించారు వైవీ. వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం వైనాట్‌-175 లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని.. అందుకే పార్టీలో మార్పులు జరుగుతున్నాయని చెప్పారు. పవన్‌, చంద్రబాబు ఎన్ని కుతంత్రాలు పన్నినా జగన్‌ కు తిరుగు లేదని చెప్పారు. ఏపీలో అమలవుతున్న సంక్షేమ పథకాలు.. అభివృద్ధి కార్యక్రమాల వల్ల మళ్లీ ప్రజల ఆశీస్సులు జగన్ కే ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు వైవీ సుబ్బారెడ్డి. 

Tags:    
Advertisement

Similar News