తిరుమల ఘాట్ రోడ్ లో బస్సు బోల్తా..
సరిగ్గా ప్రమాదం జరిగిన సమయంలో వారు అదే ప్రాంతంలో ఉండటంతో వెంటనే రక్షణ చర్యలు చేపట్టగలిగారు. అద్దాలు పగలగొట్టి భక్తుల్ని బయటకు లాగారు, వారికి ప్రాథమిక చికిత్సఅందించారు.
తిరుమల ఘాట్ రోడ్ లో బస్సు బోల్తా పడింది. ఈ ఘటన మొదటి ఘాట్ రోడ్ లో జరిగింది. తిరుమల నుంచి ఈ బస్సు తిరుపతికి వస్తుండగా 29, 30 మలుపుల మధ్య డివైడర్ ని ఢీకొంది. డివైడర్ పైనుంచి దూసుకెళ్లి రోడ్డు పక్కన లోయలోకి ఒరిగిపోయింది. అదృష్టం ఏంటంటే.. బస్సు ప్రమాదంలో ప్రాణ నష్టం జరగలేదు. కొంతమందికి మాత్రం గాయాలయ్యాయి. డ్రైవర్ సహా గాయపడిన భక్తుల్ని తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు.
బస్సు లోయలో బోల్తా పడిందనగానే ఒక్కసారిగా కలకలం రేగింది. లోయలో బోల్తా పడింది కానీ ఎత్తు తక్కువగా ఉండటంతో ప్రాణ నష్టం సంభవించలేదు. బస్సు మరో రెండు మూడు పల్టీలు కొట్టి కిందవరకు వెళ్లి ఉంటే నష్టం ఊహకందేది కాదు అంటున్నారు. దానికి తోడు ఎస్పీఎఫ్ సిబ్బంది అప్పుడే విధులు ముగించుకుని కొండ కిందకు వస్తున్నారు. సరిగ్గా ప్రమాదం జరిగిన సమయంలో వారు అదే ప్రాంతంలో ఉండటంతో వెంటనే రక్షణ చర్యలు చేపట్టగలిగారు. అద్దాలు పగలగొట్టి భక్తుల్ని బయటకు లాగారు, వారికి ప్రాథమిక చికిత్సఅందించారు.
ఇటీవల ఘాట్ రోడ్ లో జరిగిన ప్రమాదాల్లో భక్తులు మరణించిన ఉదాహరణలు కూడా ఉన్నాయి. తాజా ఘటనలో బస్సు బోల్తాపడినా ప్రాణ నష్టం జరక్కపోవడం విశేషం అంటున్నారు. ఏడుకొండలవాడి దయతోనే తామంతా బతికి బయటపడ్డామని చెబుతున్నారు భక్తులు. ఇటీవల కొండపైకి కొత్తగా ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సుల్ని ప్రవేశ పెట్టింది. వీటిలో ఒకటి ఈరోజు ప్రమాదానికి గురైంది.