మేం గెలిచిన విశాఖలో మీరు ఓడిపోయారుగా.. టీడీపీకి బీజేపీ సెటైర్లు
2014 ఎన్నికల్లో ఇదే పొత్తులో భాగంగా బీజేపీ అభ్యర్థి కంభంపాటి హరిబాబు విశాఖ లోక్‌సభ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి 90వేల పైచిలుకు ఓట్ల తేడాతో గెలిచారు.
పొత్తులో భాగంగా 6 ఎంపీ స్థానాలు ఖాయం చేసుకున్న బీజేపీ వాటితోనే టీడీపీకి చుక్కలు చూపిస్తోంది. ఏలూరు, నరసాపురం, రాజమండ్రి, విశాఖపట్నం ఇలా టీడీపీకి కాస్త అవకాశాలున్న ప్రతిచోటా కర్చీఫ్ వేస్తోంది. వీటిని బీజేపీకి ఇస్తే ఓడిపోతుందని తెలిసినా పొత్తు బెడిసికొడుతుందేమోనని, కాదు అని చెప్పకుండా బాబు నెట్టుకొస్తున్నారు. ఇదిలా ఉండగా విశాఖ సీటు కోసం మాత్రం బీజేపీ గట్టిగా పట్టుబడుతోంది. ఇది గతంలో తాము గెలిచిన సీటని గుర్తు చేస్తోంది. మీరు ఓడిపోయారుగా అని ఇన్‌డైరెక్ట్‌గా సెటైర్లు వేస్తోంది.
మేం 90 వేలతో గెలిస్తే మీరు 4వేలతో ఓడారు
2014 ఎన్నికల్లో ఇదే పొత్తులో భాగంగా బీజేపీ అభ్యర్థి కంభంపాటి హరిబాబు విశాఖ లోక్‌సభ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి 90వేల పైచిలుకు ఓట్ల తేడాతో గెలిచారు. అదీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి భార్య, వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మపై. అంతటి బలమైన అభ్యర్థిపై బీజేపీ క్యాండేట్ ఏకంగా 90 వేల పైచిలుకు ఓట్ల తేడాతో నెగ్గడం అప్పట్లో సంచలనం. కానీ 2019 ఎన్నికలకు వచ్చేసరికి వైసీపీ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ చేతిలో టీడీపీ అభ్యర్థి, లోకేశ్ తోడల్లుడు ఎం.శ్రీభరత్ 4,500 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇదే విషయాన్ని గుర్తు చేసి ఆ సీటు మాకు కావాలని బీజేపీ పట్టుబడుతోంది.
ఎవరికైనా ఆషామాషీ కాదు
విశాఖలో బీజేపీకి సీటిస్తే తాను పోటీ చేయాలని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహరావు ఉవ్విళ్లూరుతున్నారు. టీడీపీదే ఆ సీటు అంటూ శ్రీభరత్ మరోసారి పోటీకి సిద్ధమవుతున్నారు. ఎవరు నిలబడినా అక్కడ వైసీపీ అభ్యర్థి బొత్స ఝాన్సీని ఓడించడం చాలా కష్టం. ఎందుకంటే ఉత్తరాంధ్రలో కీలకనేత బొత్స సత్యనారాయణ భార్యను ఇక్కడ రంగంలోకి దింపారు. పార్టీ ప్లస్‌పాయింట్లతోపాటు బొత్స వర్గం ఇక్కడ ప్రత్యర్థుల ఆటల్ని అంత ఆషామాషీగా సాగనివ్వదు.