ఈ వార్నింగ్ చంద్రబాబు, పవన్‌లకే
ఈ వార్నింగ్ జగన్, చంద్రబాబులకు అని జీవీఎల్ చెబుతున్నా.. కన్నా ఎపిసోడ్ నేపథ్యంలో ఆయన్ను తీసుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని చంద్రబాబు, పవన్‌కు జీవీఎల్ హెచ్చరించినట్టుగా ఉంది.
బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఇచ్చిన వార్నింగ్ ఇప్పుడు ఆసక్తిగా ఉంది. కన్నా లక్ష్మీనారాయణ బీజేపీని వీడటం దాదాపు ఖాయం అన్న ప్రచారం నడుస్తోంది. మంగళవారం భీమవరంలో జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ భేటీకి కూడా కన్నా హాజరుకాలేదు. ఆయన పార్టీ మారడం ఖాయం.. టీడీపీలోకా, జనసేనలోకా అన్నదే తేలాలన్న ప్రచారం నడుస్తోంది.
ఈ నేపథ్యంలో జీవీఎల్ నరసింహరావు.. తమ పార్టీ నేతలకు గాలం వేసే వారికి వార్నింగ్ ఇచ్చారు. ''జగన్, చంద్రబాబు మీకే చెబుతున్నాం.. బీజేపీని బలహీనపరిచే కుట్రలు చేసినా, బీజేపీని దెబ్బతీసేందుకు బీజేపీ నాయకులకు గాలం వేసినా చూస్తూ ఊరుకోం.. అంతకు అంత రాజకీయంగా సమాధానం చెబుతాం'' అంటూ జీవీఎల్ వార్నింగ్ ఇచ్చారు. బీజేపీని గతంలో ఇలాగే విజయవంతంగా దెబ్బతీశారు.. ఇప్పుడు ఆ సీన్ లేదు అంటూ జీవీఎల్ మాట్లాడారు.
ఈ వార్నింగ్ జగన్, చంద్రబాబులకు అని జీవీఎల్ చెబుతున్నా.. కన్నా ఎపిసోడ్ నేపథ్యంలో ఆయన్ను తీసుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని చంద్రబాబు, పవన్‌కు జీవీఎల్ హెచ్చరించినట్టుగా ఉంది. కన్నా ఎంట్రీపై కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో వద్ద మీడియాతో పవన్ స్పందించారు. కన్నా బీజేపీలో ఉన్నారు.. మేం బీజేపీతో పొత్తులో ఉన్నాం కాబట్టి ఆయన చేరుతారా లేదా అన్న దానిపై తాను మాట్లాడడం సరికాదని పవన్ దాటవేశారు. సో.. బీజేపీ పొత్తులో ఉంటూ ఆ పార్టీలో ఉన్న కన్నాను పవన్ కల్యాణ్ తీసుకుంటే బీజేపీతో వివాదం పెట్టుకున్నట్టే. ఒకవేళ కన్నాకు టీడీపీ గాలం వేస్తే.. కేంద్రంలో ఉన్న బీజేపీ ఆగ్రహించే అవకాశం ఉంది. జీవీఎల్ వార్నింగ్ ప్రతిపక్ష పార్టీలకే అన్నట్టుగా ఉంది.