పోలవరం ప్రాజెక్టుకు మోడీ పేరు.. ఎంపీ జీవీఎల్ డిమాండ్
పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా కల్పించి భారీగా నిధులు ఇస్తోందని.. అందుకే పోలవరం ప్రాజెక్టుకు ప్రధానమంత్రి మోడీ సాగునీటి ప్రాజెక్టుగా నామకరణం చేయాలని కోరారు.
రాజ్యసభ ఎంపీ, బీజేపీ లీడర్ జీవీఎల్ నరసింహరావు ఓ వింత డిమాండ్ చేశారు. సోమవారం రాజ్యసభలో క్వశ్చన్ అవర్ టైమ్‌లో మాట్లాడిన జీవీఎల్.. పోలవరం ప్రాజెక్టుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. మోడీ పేరు ఎందుకు పెట్టాలన్నదానికి కారణం కూడా చెప్పారు.
పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా కల్పించి భారీగా నిధులు ఇస్తోందని.. అందుకే పోలవరం ప్రాజెక్టుకు ప్రధానమంత్రి మోడీ సాగునీటి ప్రాజెక్టుగా నామకరణం చేయాలని కోరారు. ఈ ప్రాజెక్టుకు ప్రతి పైసా కేంద్ర ప్రభుత్వమే ఇస్తున్నందున తాను చేసిన ఈ విజ్ఞప్తిపై కేంద్ర జల్‌శక్తి మంత్రి స్పందించాలని కోరారు.
ఈ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను కేంద్రం తీసుకునే అవకాశం ఉందా అని ప్రశ్నించారు జీవీఎల్. ఆయన ప్రశ్నకు స్పందించిన జల్‌శక్తి మంత్రి గజేంద్ర షెకావత్.. భారత ప్రభుత్వం పోలవరంను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినప్పటి నుంచి ఇప్పటివరకూ రూ.15,146 కోట్లు ఇచ్చిందన్నారు.
గతంలో పోలవరం ప్రాజెక్టు పేరు ఇందిరా సాగర్ పోలవరం ప్రాజెక్టుగా ఉండేది. అయితే 2015లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం.. ఇందిరా సాగర్ తొలగించి ప్రాజెక్టు పేరును పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టుగా పేరు మారుస్తూ జీవో జారీ చేసింది.