ఆదినారాయణరెడ్డి మీరున్నది బీజేపీలో.. టీడీపీలో కాదు..!

ఇలా ఆదినారాయణరెడ్డి మాట్లాడడం గమ్మత్తుగా ఉంది. ప్రత్యేక హోదా ఇవ్వనిది ఎవరు..? కేంద్ర ప్రభుత్వం కాదా..?. విశాఖ స్టీల్‌ను అమ్మకానికి పెట్టేందుకు సిద్ధమైంది ఎవరు..? ఓనర్‌గా చెప్పుకుంటున్న కేంద్రం కాదా..?

Advertisement
Update:2022-12-01 09:23 IST

2014లో వైసీపీ తరపున గెలిచి ఆ తర్వాత టీడీపీలోకి ఫిరాయించి, మంత్రిగా ఉన్నప్పుడు వైసీపీ నేతలకు ఛాలెంజ్‌లు చేసిన మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి.. ఎన్నికలు అయిపోగానే బీజేపీలో చేరిపోయారు. బీజేపీలోకి కేవలం రక్షణ కోసమే ఆదినారాయణరెడ్డి చేరారన్న విమర్శ ఉంది. బీజేపీలో ఉన్నప్పటికీ ఆయన టీడీపీ నేత తరహా మాట్లాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని నిందించాల్సిన అంశాల్లోనూ జగన్‌నే విమర్శిస్తున్నారు ఆదినారాయణరెడ్డి.

వివేకానందరెడ్డి కేసును తెలంగాణకు బదిలీ చేసిన నేపథ్యంలో జగన్‌మోహన్ రెడ్డి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని ఆదినారాయణరెడ్డి డిమాండ్ చేశారు. ఈ కేసులో విజయసాయిరెడ్డి, జగన్‌, అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, భారతీరెడ్డిలను విచారించాలని డిమాండ్ చేశారు. గొడ్డలి పోటును గుండెపోటుగా ప్రచారం చేసి, ఆ తర్వాత దాన్ని తమపైకి మళ్లించే ప్రయత్నం చేశారని ఆదినారాయణరెడ్డి విమర్శించారు.

175 స్థానాల్లో గెలిపించాలని జగన్ కోరుతున్నారని.. బాబాయ్‌ని చంపినందుకా..?, కరోనా సమయంలో ప్రజల ప్రాణాలు పోతుంటే పట్టించుకోనందుకా..?, ప్రత్యేక హోదా తీసుకురాలేకపోయినందుకా..?, విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ నుంచి అడ్డుకోలేకపోతున్నందుకా..?, ఎందుకు 175 స్థానాల్లో గెలిపించాలని ఆదినారాయణరెడ్డి ప్రశ్నించారు.

ఇలా ఆదినారాయణరెడ్డి మాట్లాడడం గమ్మత్తుగా ఉంది. ప్రత్యేక హోదా ఇవ్వనిది ఎవరు..? కేంద్ర ప్రభుత్వం కాదా..?. విశాఖ స్టీల్‌ను అమ్మకానికి పెట్టేందుకు సిద్ధమైంది ఎవరు..? ఓనర్‌గా చెప్పుకుంటున్న కేంద్రం కాదా..?. కేంద్ర ప్రభుత్వాన్ని నడుపుతున్నది బీజేపీ కాదా..?. మరి బీజేపీలో ఉన్న ఆదినారాయణ రెడ్డి.. టీడీపీ నేతల తరహాలో బీజేపీ తప్పులను కూడా జగన్ ఖాతాలో వేసేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నారు..?. విశాఖ స్టీల్‌ను నాశనం చేయడం తమ బీజేపీ జన్మహక్కు.. దాన్ని అడ్డుకోలేకపోవడమే జగన్ తప్పు అన్నట్టుగా ఆదినారాయణరెడ్డి తీరు ఉంది.

Tags:    
Advertisement

Similar News