జగన్‌పై నీచమైన వ్యాఖ్యలు.. పవన్ కల్యాణ్‌పై బీజేపీ పెద్దల ఆగ్రహం?
ప్రత్యర్థిపై ద్వేషాన్ని వెళ్లగక్కడానికి ఇది తగిన సమయం కాదని, చాలా కాలంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్ అనాలోచితంగా ద్వేషపూరితమైన వ్యాఖ్యలు చేస్తున్నారని, దానివల్ల వారి మనుగడనే దెబ్బ తింటుందని బీజేపీ నాయకులు భావిస్తున్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద జరిగిన దాడిపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యల మీద బీజేపీ కేంద్ర నాయకత్వం తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. జగన్ కు దెబ్బ తాకితే రాష్ట్రానికి తాకినట్లు వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారని పవన్ కల్యాణ్ అన్నారు. ఎన్నికలు రాగానే జగన్ పై దాడి జరుగుతుందని, గతంలో కోడికత్తి దాడి జరిగిందని ఆయన అన్నారు. ఎన్నికల సమీపించగానే ఎవరైనా చావడమో, ఎవరినైనా చంపడమో జరుగుతుందని ఆయన అన్నారు. పూలమాల చాటున రాయిని దాచి పెట్టి జగన్ దాంతో గాయం చేసుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు. మరింత నీచంగా కూడా మాట్లాడారు.
ఆ వ్యాఖ్యలపై బీజేపీ పెద్దలు మండిపడుతున్నట్లు తెలుస్తోంది. జగన్ పై జరిగిన దాడిని ఖండిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ తొలుత స్పందించారు. జగన్ పై నిజంగానే దాడి జరిగిందా, ఆయనే దాడి చేయించుకున్నారా అనే విషయం నిర్ధారణ కాకుండానే పవన్ కల్యాణ్ రెచ్చిపోయి మాట్లాడడాన్ని బీజేపీ తప్పు పడుతోంది. రాయి నేరుగా వచ్చి జగన్ కు, ఆ తర్వాత వెల్లంపల్లికి తాకినట్లు వీడియో ఫుటేజీలో స్పష్టంగా కనిపిస్తోంది. అయినప్పటికీ పవన్ కల్యాణ్ జగన్ మీద అనుమానాలు వ్యక్తం చేస్తూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.
పవన్ కల్యాణ్ ప్రసంగం పూర్తి పాఠం అనువాదాన్ని మోడీ జట్టు సభ్యులు తెప్పించుకున్నట్లు తెలుస్తోంది. పవన్ కల్యాణ్ ప్రతిదాన్నీ సినిమా కళ్లద్దాలతోనే చూస్తున్నారని, హీరో మాదిరిగా డైలాగ్ లు చెప్పవద్దని ఆయనకు ఎవరైనా సలహా ఇవ్వాలని, అటువంటి వ్యాఖ్యల వల్ల తటస్థ ఓటర్లు కూటమి మొత్తానికే దూరమవుతారని బీజేపీ నాయకులు అంటున్నారు.
ప్రత్యర్థిపై ద్వేషాన్ని వెళ్లగక్కడానికి ఇది తగిన సమయం కాదని, చాలా కాలంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్ అనాలోచితంగా ద్వేషపూరితమైన వ్యాఖ్యలు చేస్తున్నారని, దానివల్ల వారి మనుగడనే దెబ్బ తింటుందని బీజేపీ నాయకులు భావిస్తున్నారు. పవన్ కల్యాణ్ ఊగిపోతూ అటువంటి డైలాగ్ లు ఎందుకు చెప్తారో అర్థం కావడం లేదని వారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రసంగాలను మోడీ సన్నిహితులు జాగ్రత్తగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. వాటి ఆధారంగా వారిద్దరిపై కచ్చితమైన నిర్ణయానికి రావాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.