నామినేషన్ల చివరి రోజు టీడీపీకి బిగ్ షాక్..
నామినేషన్ వేసేందుకు పులివెందుల వచ్చిన సీఎం జగన్ ని కలసి వైసీపీలో చేరారు టీడీపీ కీలక నేతలు.
ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు నామినేషన్ల ఘట్టం పూర్తయింది. ఈ నేపథ్యంలో ఈపాటికే ఇరు పార్టీల బలాబలాలపై ప్రజలకు ఓ అవగాహన వచ్చింది. గెలుపు ఎవరివైపు ఉంటుందనే విషయంలో సర్వేలన్నీ వైసీపీవైపు ఉన్నాయి. కొందరు టీడీపీ నేతలు కూడా జగన్ దే గెలుపు అని డిసైడ్ అయ్యారు. ఎన్నికలకు ముందుగానే వారు వైసీపీ టీమ్ లో చేరిపోతున్నారు. తాజాగా టీడీపీ నుంచి బయటకు వచ్చిన కీలక నేతలు సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు.
నామినేషన్ వేసేందుకు పులివెందుల వచ్చిన సీఎం జగన్ ని కలసి వైసీపీలో చేరారు టీడీపీ కీలక నేతలు. చిత్తూరు జిల్లాకు చెందిన టీడీపీ నేత, మాజీ మంత్రి అమర్‌నాథ్ రెడ్డి సోదరుడు శ్రీనాథ్ రెడ్డి, ఆయన భార్య అనీషా రెడ్డి.. జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. గత ఎన్నికల్లో పుంగనూరు నియోజకవర్గం నుంచి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై టీడీపీ తరపున అనీషా రెడ్డి పోటీ చేశారు. ఆమె వైసీపీలో చేరడంతో అక్కడ టీడీపీ మరింత బలహీనపడింది.
కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి కూడా వైసీపీలో చేరారు. ఏపీలో సంక్షేమ పథకాల్ని సీఎం జగన్ నేరుగా ఇళ్లకే చేర్చారని, ఆ పథకాల ద్వారా పేదల ఇళ్లలో వెలుగులు నిండాయని అన్నారు వీర శివారెడ్డి. ఆ పథకాలకు ఆకర్షితుడినై వైసీపీలో చేరానని చెప్పారాయన. సంక్షేమ పథకాలు ఇలాగే అమలు కావాలంటే మళ్లీ జగనే సీఎం కావాలన్నారు. చంద్రబాబు వల్ల ఏపీకి ప్రయోజనం లేదని, ఉమ్మడి కడప జిల్లాలో టీడీపీకి ఒక్క సీటు కూడా రాదని తేల్చి చెప్పారు వీర శివారెడ్డి.