కూటమికి పరిపూర్ణానంద షాక్.. ఇండిపెండెంట్‌గా నామినేషన్
బీజేపీతో పాటు ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు పరిపూర్ణానంద. నామినేషన్ దాఖలుకు మరో రెండురోజులు సమయం ఉన్న నేపథ్యంలో హిందూపురం ఎంపీ సీటుకు సైతం నామినేషన్ దాఖలు చేయవచ్చని తెలుస్తోంది.
చంద్రబాబు బావమరిది, హీరో నందమూరి బాలకృష్ణ పోటీ చేస్తున్న హిందూపురం నియోజకవర్గంలో కూటమికి బిగ్ షాక్ తగిలింది. శ్రీ పీఠం వ్యవస్థాపకులు స్వామి పరిపూర్ణానంద హిందూపురం అసెంబ్లీ స్థానానికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థిగా బాలకృష్ణ ఉండగా.. వైసీపీ అభ్యర్థిగా టి.ఎన్.దీపిక పోటీ చేస్తున్నారు.
కూటమిలో భాగంగా బీజేపీ తరఫున హిందూపురం ఎంపీ సీటు ఆశించిన పరిపూర్ణానందకు నిరాశే ఎదురైంది. తాను ఎంపీగా పోటీ చేస్తే టీడీపీకి మైనార్టీ ఓట్లు దూరమవుతాయన్న భయంతో టీడీపీ అధినేత చంద్రబాబే తనను తప్పించారని గతంలో సంచలన ఆరోపణలు చేశారు. ప్రజల కోరిక మేరకే ఇప్పుడు అసెంబ్లీ స్థానానికి నామినేషన్ వేశానని చెప్పారు పరిపూర్ణానంద.
ఇక బీజేపీతో పాటు ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు పరిపూర్ణానంద. నామినేషన్ దాఖలుకు మరో రెండురోజులు సమయం ఉన్న నేపథ్యంలో హిందూపురం ఎంపీ సీటుకు సైతం నామినేషన్ దాఖలు చేయవచ్చని తెలుస్తోంది. మొత్తానికి హిందూపురంలో ఎన్డీఏ కూటమికి పరిపూర్ణానంద కంట్లో నలుసులా మారారని అంటున్నారు.