తెరపైకి బ్రాహ్మణి.. రాజమండ్రిలో కొవ్వొత్తుల ర్యాలీ

తమ కుటుంబానికి ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదన్నారు బ్రాహ్మణి. 42 ఏళ్ల రాజకీయ అనుభవమున్న నేతను జైల్లో పెట్టారని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే చంద్రబాబు చేసిన నేరమా..? అని ప్రశ్నించారు.

Advertisement
Update:2023-09-16 21:19 IST

చంద్రబాబు అరెస్ట్ తర్వాత సింపతీకోసం టీడీపీ తెగ ప్రయత్నిస్తోంది. జైలులో బాబుకి ప్రాణహాని ఉందని, ఆయనకు స్నానానికి వేడినీళ్లు లేవని, దోమలు కుడుతున్నాయని, రకరకాల ప్రచారాలతో ఎల్లో మీడియా హోరెత్తిపోతోంది. అయినా జనంలో అనుకున్న స్పందన రాలేదు. హైదరాబాద్, బెంగళూరులో ఐటీ ఉద్యోగులతో ర్యాలీలు చేపట్టినా ఏపీలో సామాన్య జనానికి అవేవీ పట్టలేదు. ఇప్పుడు మహిళా నేతల్ని తెరపైకి తెస్తున్నారు టీడీపీ నేతలు. నిన్న మొన్నటి వరకూ చంద్రబాబు పరామర్శల సమయంలో మాత్రమే కనిపించిన భువనేశ్వరి, బ్రాహ్మణి ఇప్పుడు రోడ్డుపై నిరసనకు దిగారు. నందమూరి ఆడపడుచులిద్దరూ మహిళా కార్యకర్తలతో కలసి రాజమండ్రిలో కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు.

బ్రాహ్మణి ఎంట్రీ..

భువనేశ్వరి అప్పుడప్పుడూ కుప్పంలో రాజకీయ వ్యాఖ్యలు చేసినా, లోకేష్ సతీమణి బ్రాహ్మణి మాత్రం ఇప్పటి వరకు పొలిటికల్ డైలాగులు కొట్టలేదు. కానీ తొలిసారి ఆమె కూడా రాజమండ్రిలో రాజకీయాలు మాట్లాడారు. రాజకీయ దురుద్దేశంతోనే చంద్రబాబుని జైలుకి పంపారని ఆరోపించారు. ఎన్నికల్లో లబ్ధికోసమే ఇలాంటి పనులు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు, లోకేష్ యాత్రలకు ప్రజల నుంచి వస్తున్న మద్దతు చూసి ఓర్వలేకే, వారిని అడ్డుకోడానికి ఓ పథకం ప్రకారం ఈ కుట్ర చేశారన్నారు బ్రాహ్మణి.

మామయ్య నిర్దోషిగా బయటకొస్తారు..

తమ కుటుంబానికి ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదన్నారు బ్రాహ్మణి. 42 ఏళ్ల రాజకీయ అనుభవమున్న నేతను జైల్లో పెట్టారని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే చంద్రబాబు చేసిన నేరమా..? అని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం గంజాయి, లిక్కర్‌ ఇచ్చి యువత జీవితాలను నాశనం చేస్తోందన్నారు బ్రాహ్మణి. చంద్రబాబు అరెస్టును దేశమంతా ఖండిస్తోందని చెప్పారు. జాతీయ నేతలు కూడా తమకు సంఘీభావం తెలుపుతున్నారని అన్నారు. న్యాయవ్యవస్థపై తమకు నమ్మకం ఉందని, చంద్రబాబు నిర్దోషిగా బయటకు వస్తారని ధీమా వ్యక్తం చేశారు బ్రాహ్మణి.

Tags:    
Advertisement

Similar News