శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీపై చంద్రబాబుకు బండి సంజయ్‌ బహిరంగ లేఖ

తిరుమల కొండ పవిత్రతపై, లడ్డూ ప్రసాదాలపై ప్రజల్లో నెలకొన్న అనుమానాలను నివ్రత్తి చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేసిన సంజయ్‌

Advertisement
Update:2024-09-20 14:03 IST

తిరుమలశ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీతోపాటు జరుగుతున్న అవినీతి, అన్యమత ప్రచారంపై సమగ్ర విచారణ జరిపి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ...ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ బహిరంగ లేఖ రాశారు.

కలియుగ ప్రత్యక్ష దైవం, కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం, వైకుంఠాధీశుడు శ్రీ వెంకటేశ్వరస్వామి కొలువైన తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారికి ప్రీతిపాత్రమైన లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వుతోపాటు కల్తీ అయిన నెయ్యిని, చేప నూనెను వినియోగించారని వస్తున్న కథనాలు శ్రీవారి భక్త కోటిని, యావత్ ప్రపంచంలోని హిందువుల మనోభావాలను తీవ్రంగా కలిచి వేస్తోంది.

గత పాలకులు శ్రీవారి పవిత్రతను దెబ్బతీశారని, అన్యమత ప్రచారం కూడా జరుగుతున్నదని గతంలో అనేక ఫిర్యాదులు వచ్చినా ఎన్నడూ పట్టించుకోలేదు. శేషాచలం కొండల్లో ఎర్రచందనం కొల్లగొడుతూ ఏడు కొండలవాడిని రెండు కొండలకే పరిమితం చేశారని విమర్శలు వెల్లువెత్తినా స్పందించలేదు. రెండ్రోజుల కిందట (18.09.2024) ముఖ్యమంత్రి స్థానంలో ఉంటూ ‘‘అన్నప్రసాదం నుండి లడ్డూ ప్రసాదం వరకు అన్నింటినీ సర్వనాశనం చేశారు. జంతువుల కొవ్వును లడ్డూ ప్రసాదంలో వినియోగించారు.’’ అని మీరు చేసిన వ్యాఖ్యలతో ఇది నిజమేనని యావత్ హిందూ సమాజం భావిస్తున్నది.

లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వును వినియోగించడం అత్యంత నీచం. ఒకవేళ అదే నిజమైతే హిందూ ధర్మంపై దాడికి భారీ కుట్ర జరిగినట్లుగానే అనుమానిస్తున్నాం. లడ్డూ ప్రాముఖ్యాన్ని తగ్గించడానికి, టీటీడీపై కోట్లాదిమంది భక్తులకు ఉన్న విశ్వాసాన్ని సడలించేందుకు ఈ కుట్ర చేసినట్లుగా భావిస్తున్నాం. సాక్షాత్తు శ్రీవారు కొలువైన పరమ పవిత్రమైన తిరుమల కొండపైనే ఇంతటి ఘోరమైన అపచారానికి పాల్పడిన వారు క్షమించరాని నేరానికి ఒడిగట్టినట్లే. అన్యమతస్తులకు టీటీడీ పగ్గాలు అప్పగించడం, అన్యమతస్తులకు ఉద్యోగాల్లో అవకాశం కల్పించడంవల్లే ఇలాంటి కుట్రలకు ఆస్కారం ఏర్పడింది. ఉన్నతస్థాయి వ్యక్తుల పాత్ర లేనిదే ఇంతటి నీచమైన పనిని నిరాటంకంగా ఏళ్ల తరబడి కొనసాగించే అవకాశం లేదు. ఉన్నతస్థాయి వ్యక్తుల ప్రమేయాన్ని నిర్ధారించడంతోపాటు, ఇతర రాష్ట్రాల్లోనూ విచారణను కొనసాగించాల్సిన అవసరమున్న నేపథ్యంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)తో విచారణ జరిపిస్తేనే సమగ్ర దర్యాప్తు జరిగి వాస్తవాలు నిగ్గు తేలే అవకాశముంది. అయితే ఈ విషయంలో అంతిమ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిదే.

రాజకీయ ప్రయోజనాలను పూర్తిగా పక్కనపెట్టి ప్రపంచంలోని యావత్ హిందువుల మనోభావాలను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్నది. తక్షణమే సమగ్ర విచారణకు ఆదేశించాలని, దోషులుగా తేలిన వారు ఎంతటి వారైనా, ఏ పార్టీ వారైనా సరే చట్ట ప్రకారం శిక్ష పడేలా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. హిందూ ధార్మిక క్షేత్రంలో అన్యమత ప్రచారం కూడా పూర్తిగా నిషిద్ధం. దేవుడిపై నమ్మకం లేని నాస్తికులకు, అన్యమతస్తులకు టీటీడీ పగ్గాలు అప్పగించడంవల్లే పవిత్రమైన తిరుమల కొండపై ఇలాంటి నీచమైన, ఘోరమైన కార్యక్రమాలకు ఆస్కారం ఏర్పడింది. ఇకపై అలాంటి వారికి టీటీడీ పగ్గాలు అప్పగించకుండా, అన్యమత ప్రచారం జరగకుండా కఠినమైన చట్టాలు తీసుకురావాలని కోరుతున్నా. తిరుమల కొండ పవిత్రతపై, లడ్డూ ప్రసాదాలపై ప్రజల్లో నెలకొన్న అనుమానాలను నివ్రత్తి చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నానని లేఖలో బండి సంజయ్‌ పేర్కొన్నారు.

Tags:    
Advertisement

Similar News