గన్ మెన్లను సరెండర్ చేసిన బాలినేని.. వైసీపీలో మళ్లీ రచ్చ

తన నియోజకవర్గ పరిధిలో వెలుగు చూసిన భారీ కుంభకోణం దర్యాప్తులో ఒంగోలు పోలీసులు తన సూచనలను పరిగణలోకి తీసుకోకపోవడంతో బాలినేనికి తలకొట్టేసినట్టయింది. దీంతో ఆయన పోలీసులపై కొన్నిరోజులుగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Update:2023-10-17 10:00 IST

ఏపీ వైసీపీలో మళ్లీ ఒంగోలు రాజకీయం రచ్చకెక్కింది. మంత్రి పదవి కోల్పోయిన తర్వాత బాలినేని శ్రీనివాసులరెడ్డి హడావిడి చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత సమన్వయకర్త పదవికి కూడా ఆయన రాజీనామా చేశారు, ఒంగోలుకే పరిమితం అవుతానన్నారు. ఇటీవల వైసీపీ సంతనూతలపాడు పరిశీలకుడు భవనం శ్రీనివాసరెడ్డిపై సస్పెన్షన్ వేటు కూడా బాలినేనికి మనస్థాపం కలిగించింది. తాజాగా ఆయన తన గన్ మెన్లను కూడా ప్రభుత్వానికి సరెండర్ చేయడం విశేషం. ఈమేరకు ఆయన డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి లేఖ రాశారు. బాలినేని గన్ మెన్ల సరెండర్ విషయం ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

ఎందుకీ అలక..?

గతంలో ఓసారి సీఎం పర్యటన సందర్భంగా ప్రోటోకాల్ అంటూ తనను హెలిప్యాడ్ వద్దకు వెళ్లకుండా అడ్డుకోవడంతో పోలీసులపై బాలినేని అలిగారు. ఆ తర్వాత కూడా ఒంగోలు పోలీసులు తన మాట లెక్కచేయడంలేదంటూ ఆయన గుర్రుగా ఉన్నారు. తాజాగా ఒంగోలులో ఫేక్ డాక్యుమెంట్ల స్కామ్ బయటపడింది. నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తూ భూముల్ని కబ్జా చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఈ కేసు డీల్ చేస్తోంది. ఇప్పటికే 9 కేసులు నమోదయ్యాయి. ఏడుగురిని అరెస్ట్ చేశారు. కానీ అసలు దోషుల్ని పోలీసులు కావాలనే వదిలిపెట్టారనేది బాలినేని వాదన. సిట్ దర్యాప్తుపై ఆయన సంతృప్తిగా లేరు.

తన నియోజకవర్గ పరిధిలో వెలుగు చూసిన భారీ కుంభకోణం దర్యాప్తులో ఒంగోలు పోలీసులు తన సూచనలను పరిగణలోకి తీసుకోకపోవడంతో బాలినేనికి తలకొట్టేసినట్టయింది. దీంతో ఆయన పోలీసులపై కొన్నిరోజులుగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు తన సూచనలను పట్టించుకోకపోవటంతో గన్‌ మెన్‌ లను సరెండర్‌ చేస్తున్నట్లు డీజీపీకి రాసిన లేఖలో పేర్కొన్నారు బాలినేని. నాలుగేళ్ల నుంచి ఇలాంటి విచిత్ర పరిస్థితులు చూస్తున్నానని చెప్పారు. పోలీసులు తన మాట పెడచెవిన పెట్టారని, అసలు దోషుల్ని వదిలేస్తున్నారని.. అందుకే గన్‌ మెన్‌ లను తక్షణం సరెండర్‌ చేస్తున్నట్లు పేర్కొన్నారు బాలినేని. 


Tags:    
Advertisement

Similar News