వైసీపీలో లుకలుకలు.. ప్రెస్ మీట్ లో బాలినేని కంటతడి

పార్టీమీద అభిమానం లేని వ్యక్తులు సిగ్గు లేకుండా ఎక్కడో ఇతర రాష్ట్రాలు, విదేశాల నుండి వీడియోలు సోషల్ మీడియాలో పెడుతున్నారని మండిపడ్డారు బాలినేని. తాను టీడీపీతో, జనసేనతో టచ్ లో ఉన్నాననే ప్రచారం అవాస్తవం అని చెప్పారు.

Advertisement
Update:2023-05-05 19:29 IST

సొంత పార్టీ నేతలపైనే తీవ్ర ఆరోపణలు చేశారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి. ప్రెస్ మీట్ లో కంటతడి పెట్టారు. చివరకు తాను సీట్లు ఇప్పించిన ఎమ్మెల్యేలు కూడా తనపై జగన్ కి ఫిర్యాదులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీపై అభిమానం ఉంది అంటూనే కార్యకర్తలకోసం ఏదైనా చేస్తాను, ఏ త్యాగానికైనా సిద్ధం అంటూ తేల్చేశారు. దాదాపుగా వైసీపీలో బాలినేని ఎపిసోడ్ పీక్ స్టేజ్ కి చేరిందనే చెప్పాలి.

వైసీపీలో బలమైన నాయకుడు బాలినేని శ్రీనివాసులరెడ్డి. ఐదుసార్లు ఎమ్మెల్యే, వైఎస్ఆర్ హయాంలో కూడా మంత్రిగా పనిచేశారు, జగన్ తొలి కేబినెట్ లో మంత్రి పదవి దక్కించుకున్నారు. ప్రకాశం జిల్లాలో ఆయన ప్రాతినిధ్యం వహించే ఒంగోలుకే పరిమితం కాకుండా మిగతా నియోజకవర్గాల్లో కూడా ఆయన ప్రభావం చూపించగల వ్యక్తి. మూడు జిల్లాలకు కోఆర్డినేటర్ గా కూడా పనిచేశారు. కానీ ఇప్పుడు పార్టీకి దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. బాలినేని ప్రెస్ మీట్ తర్వాత దాదాపుగా వైసీపీలో ఆయన కథ ముగిసిపోతుందనే సంకేతాలు వెలువడుతున్నాయి. నియోజకవర్గానికి ఎక్కువరోజులు కేటాయించలేక పోతున్నందుకే తాను జిల్లాల కోఆర్డినేటర్ పదవికి రాజీనామా చేశానంటున్నారు బాలినేని.

తనపై ఫిర్యాదు చేసింది ఎవరు, తనపై తప్పుడు ప్రచారాలు చేస్తుంది ఎవరనే విషయంపై బాలినేని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. జిల్లాకు చెందిన ఏ ఎమ్మెల్యేపేరు కూడా ఆయన ప్రస్తావించలేదు. అయితే పక్క రాష్ట్రానికి చెందిన గోనె ప్రకాష్ రావు తనపై ఎందుకు ఆరోపణలు చేస్తున్నారని ప్రశ్నించారు. తమ పార్టీలోని వైవీ సుబ్బారెడ్డి, ఆయన భార్య గురించి గోనె ప్రకాష్ రావు గొప్పగా మాట్లాడతారని, తనపై, తమ నాయకుడు జగన్ పై మాత్రం గోనె ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

పార్టీమీద అభిమానం లేని వ్యక్తులు సిగ్గు లేకుండా ఎక్కడో ఇతర రాష్ట్రాలు, విదేశాలనుండి వీడియోలు సోషల్ మీడియాలో పెడుతున్నారని మండిపడ్డారు బాలినేని. తాను టీడీపీతో, జనసేనతో టచ్ లో ఉన్నాననే ప్రచారం అవాస్తవం అని చెప్పారు. తనకు రాజకీయ భిక్ష పెట్టింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని చెప్పారు. బాలినేని వ్యాఖ్యలపై వైసీపీ నేతలు స్పందించే తీరుని బట్టి ఆయన రాజకీయ భవిష్యత్తు ఏంటనేది తేలిపోతుంది. 

Tags:    
Advertisement

Similar News