బాలయ్య కోర్కెను బావ నెరవేరుస్తారా..?

గత వైసీపీ ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన సమయంలోనే బాలకృష్ణ ఈ డిమాండ్ చేశారు. ఇప్పుడు టీడీపీ అధికారంలోకి రావడంతో బాలయ్య డిమాండ్ నెరవేరే అవకాశముంది.

Advertisement
Update:2024-08-16 15:56 IST

కూటమి అధికారంలోకి వచ్చిన కొత్తల్లో కాస్త హడావిడి చేసిన హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. ఆ తర్వాత కొన్నిరోజులుగా సైలెంట్ గా ఉన్నారు. మళ్లీ ఇప్పుడు అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన తెరపైకి వచ్చారు. వస్తూ వస్తూనే తన బావ సీఎం చంద్రబాబు ముందు ఓ ప్రతిపాదన పెట్టారు. శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రాన్ని పుట్టపర్తి నుంచి హిందూపురానికి మార్చాలని కోరారు.

శ్రీ సత్య సాయి జిల్లా కేంద్రంగా పుట్టపర్తి స్థానంలో హిందూపురాన్ని ప్రకటించాలంటూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు బాలకృష్ణ. ఈ రోజు హిందూపురం నియోజకవర్గంలో పర్యటించిన ఆయన. అన్న క్యాంటీన్‌ ప్రారంభించారు. అక్కడికి వచ్చిన వారికి తానే స్వయంగా టిఫిన్‌ వడ్డించారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలన్న డిమాండ్ పై స్పందించారు. ఆల్రడీ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని, సీఎం చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు బాలకృష్ణ.

గత వైసీపీ ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన సమయంలోనే బాలకృష్ణ ఈ డిమాండ్ చేశారు. సత్యసాయి జిల్లా పేరులో ఎలాంటి మార్పు చేయకుండా.. జిల్లా హెడ్ క్వార్టర్ ను హిందూపురానికి మార్చాలంటూ గతంలోనే స్థానిక ఎమ్మెల్యే హోదాలో ఆయన ఆందోళన చేపట్టారు. ఇప్పుడు టీడీపీ అధికారంలోకి రావడంతో బాలయ్య డిమాండ్ వెంటనే నెరవేరే అవకాశముంది. మరి చంద్రబాబు ఈ ప్రతిపాదనపై ఎలా స్పందిస్తారో చూడాలి. 

Tags:    
Advertisement

Similar News