అవినాష్ బెయిల్ రద్దు పిటిషన్ పై నేడు సుప్రీంలో విచారణ
అవినాష్ రెడ్డి ప్రతి శనివారం సీబీఐ విచారణకు హాజరవుతున్నారు. కానీ సునీత మాత్రం ఆ బెయిల్ రద్దు చేయాలని కోరుతున్నారు. సుప్రీంకోర్టులో ఆమె వేసిన పిటిషన్ పై ఈరోజు కీలక విచారణ జరుగుతుంది.
అవినాష్ రెడ్డి బెయిలు రద్దు చేయాలంటూ వైఎస్ వివేకా కుమార్తె సునీత దాఖలు చేసిన పిటిషన్ ఈరోజు సుప్రీంకోర్టులో మరో బెంచ్ ముందుకు విచారణకు వస్తుంది. ఈనెల 13న ఈ కేసు జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ అమానుల్లా ధర్మాసనం ముందు విచారణకు రాగా.. పిటిషనర్ సునీత తన తరపున తానే వాదనలు వినిపించారు. అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని, వివేకా హత్యకేసులో సీబీఐ దర్యాప్తు గడువును జూన్ 30 నుంచి మరికొంత కాలం పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. అయితే ఈ కేసులో సీనియర్ న్యాయవాదులు వాదనలు వినిపిస్తే బాగుంటుందన్న ఇద్దరు న్యాయమూర్తుల బెంచ్, విచారణను నేటికి వాయిదా వేసింది ఈరోజు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ సుందరేష్ తో కూడిన ధర్మాసనం ఈ కేసు విచారణ చేపడుతుంది.
బెయిల్ రద్దుకోసం పట్టు..
అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి ఇప్పటికే ఈ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయనకు పలుమార్లు సీబీఐ కోర్టు బెయిల్ నిరాకరించింది. అయితే అవినాష్ రెడ్డికి మాత్రం తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. విచారణకు సహకరించాలని సూచించింది. ఆమేరకు అవినాష్ రెడ్డి ప్రతి శనివారం సీబీఐ విచారణకు హాజరవుతున్నారు. కానీ సునీత మాత్రం ఆ బెయిల్ రద్దు చేయాలని కోరుతున్నారు. సుప్రీంకోర్టులో ఆమె వేసిన పిటిషన్ పై ఈరోజు కీలక విచారణ జరుగుతుంది.
ఆదివారం కూడా..
అవినాష్ రెడ్డి ప్రతి శనివారం సీబీఐ కార్యాలయానికి వచ్చి విచారణకు హాజరై వెళ్లిపోతున్నారు. ఈనెల 17న శనివారం ఆయన మరోసారి సీబీఐ కార్యాలయానికి వచ్చారు. ఆ తర్వాతి రోజు ఆదివారం కూడా మరోసారి సీబీఐ ఆఫీస్ కి వచ్చారు. అరగంటసేపు అక్కడే ఉన్నారు. సీబీఐ అధికారులు కొన్ని పత్రాలు అడగడంతో ఆదివారం కూడా అవినాష్ రెడ్డి సీబీఐ కార్యాలయానికి వచ్చి ఇచ్చి వెళ్లారు.