అవమానాలు చేసినోళ్లకు భయం పట్టుకుంది.. బాబుకు బర్త్ డే విషెస్ చెప్పిన విజయసాయిపై అచ్చెన్న ఫైర్

విజయసాయిరెడ్డి ఎప్పుడూ లేనివిధంగా ఎంతో మర్యాదగా చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పడంతో పాటు సంపూర్ణ ఆరోగ్యం, దీర్ఘాయుష్షుతో మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటూ శుభాకాంక్షలు చెప్పారు.

Advertisement
Update:2023-04-20 18:55 IST

గతంలో చంద్రబాబును అవమానించిన వారు.. అవహేళన చేసిన వారు.. ఇప్పుడు చంద్రబాబుకు ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి భయపడుతున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. ఇవాళ చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా ట్విట్టర్ వేదికగా ఆయనకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి శుభాకాంక్షలు తెలపడంపై అచ్చెన్న పరోక్షంగా విమర్శలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పై విజయసాయిరెడ్డి చేసినన్ని విమర్శలు ఎవరూ చేసి ఉండరు. ఆ విమర్శలు కూడా తిట్ల రూపంలో ఉన్నవే అధికం. విజయసాయిరెడ్డి ఇవాళ చంద్రబాబుకు ట్విట్టర్ వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడంపై టీడీపీ శ్రేణులు ఆశ్చర్యపోయాయి.

విజయసాయిరెడ్డి ఎప్పుడూ లేనివిధంగా ఎంతో మర్యాదగా చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పడంతో పాటు సంపూర్ణ ఆరోగ్యం, దీర్ఘాయుష్షుతో మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటూ శుభాకాంక్షలు చెప్పారు. ఆయన ఆ విధంగా చంద్రబాబుకు విషెస్ చెబుతారని టీడీపీ శ్రేణులు ఊహించలేదు. దీంతో ట్విట్టర్ వేదికగా పలువురు టీడీపీ కార్యకర్తలు స్పందిస్తూ.. మీరు మారిపోయారు సార్.. మీ నుంచి ఇలాంటి శుభాకాంక్షలు ఎక్స్ పెక్ట్ చేయలేదు.. మీరు ఇలాగే ఉండండి సార్..అంటూ పలువురు కామెంట్స్ చేశారు.


ఇదిలా ఉంటే చంద్రబాబుకు విజయసాయిరెడ్డి జన్మదిన శుభాకాంక్షలు చెప్పడంపై అచ్చెన్నాయుడు పరోక్షంగా విమర్శలు చేశారు. గతంలో చంద్రబాబును అవమానించిన వారు.. అవహేళన చేసిన వారు.. ఇప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడుతున్నారని అన్నారు. చంద్రబాబును విమర్శించిన వారిని ప్రజలు ఛీకొడుతున్నారని, ప్రజల్లో వచ్చిన మార్పు చూసి గతంలో చంద్రబాబును విమర్శించిన వారిలో భయంతో కూడిన మార్పు వచ్చిందన్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో వివేకానందరెడ్డి హత్యపై తీవ్ర చర్చ జరుగుతోందని, ఈ చర్చను పక్కదోవ పట్టించేందుకే త్వరలో విశాఖలో కాపురం పెడతానని సీఎం జగన్ అంటున్నారన్నారు. టీడీపీ హయాంలోనే ఉత్తరాంధ్రలో అభివృద్ధి జరిగిందని, ఆ ప్రాంతంలో తాము చేసిన అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేస్తామని.. వైసీపీకి ఆ దమ్ము ఉందా? అని అచ్చెన్న సవాల్ విసిరారు. రాజధానిపై ఇంకా కోర్టుల్లో కేసులు నడుస్తుంటే విశాఖ కు వెళ్లి కాపురం పెడతానని సీఎం జగన్ చెప్పడం ఏంటని ఆయన ప్రశ్నించారు.

Tags:    
Advertisement

Similar News