చంద్రబాబును బీజేపీ ఫిక్స్ చేసేసిందా..?
రాబోయే ఎన్నికల్లో 4:2:1 నిష్పత్తిలో సీట్ల సర్దుబాటు జరగాలని కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా కండీషన్ పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది.
అడకత్తెరలో పోకచెక్క అనే సామెత ఇప్పుడు చంద్రబాబునాయుడు పరిస్థితికి బాగా సరిపోతుంది. రాబోయే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్ళలేరు. అలాగని బీజేపీని వద్దనుకుని ఎన్నికలకు వెళ్ళలేరు. బీజేపీతో పొత్తు విషయంలో ఏమిచేయాలో అర్థంకాక ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ నానా అవస్థలు పడుతున్నారు. ఒకవైపేమో ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది.. మరోవైపు టీడీపీ-జనసేన మధ్యే సీట్ల సర్దుబాటు, పోటీచేయాల్సిన నియోజకవర్గాలు ఇంకా ఖాయంకాలేదు. ఇప్పుడు సడన్ గా మధ్యలో బీజేపీ వచ్చి కూర్చుంది.
బీజేపీతో సీట్లు సర్దుబాటు చేసేసుకుని సీట్ల సంఖ్య, నియోజకవర్గాలను ప్రకటించేద్దామని అనుకుంటే అంత సులువుగా అయ్యేట్లు లేదు. ఎందుకంటే చంద్రబాబుకు బీజేపీ పెట్టిన ఫిట్టింగ్ అలాగుంది మరి. మీడియాలో, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని బట్టిచూస్తే బీజేపీ చేతిలో చంద్రబాబు బాగా ఇరుక్కున్నట్లే ఉన్నారు. ఎలాగంటే.. రాబోయే ఎన్నికల్లో 4:2:1 నిష్పత్తిలో సీట్ల సర్దుబాటు జరగాలని కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా కండీషన్ పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. పై నిష్పత్తి ఏమిటంటే ప్రతి పార్లమెంటు నియోజకర్గంలో ఏడు అసెంబ్లీ సీట్లుంటాయని అందరికీ తెలిసిందే.
పై దామాషా ప్రకారం నాలుగు అసెంబ్లీల్లో టీడీపీ పోటీచేయాలట. రెండింటిలో జనసేన, ఒక అసెంబ్లీలో బీజేపీ పోటీచేస్తుందట. అంటే మొత్తంమీద చూసుకుంటే 175 సీట్లో టీడీపీ 100 సీట్లు, జనసేన 50, కమలం పార్టీ 25 అసెంబ్లీల్లో పోటీచేస్తుంది. మిత్రపక్షాలకు 75 సీట్లను వదిలేస్తే ఇక చంద్రబాబు ముఖ్యమంత్రి అయినట్లే. ఈ కండీషన్ను తమ్ముళ్ళు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం.
టీడీపీతో బీజేపీ పొత్తుపెట్టుకుంటున్నది జగన్మోహన్ రెడ్డిని గెలిపించటానికేనా అనే అనుమానం తమ్ముళ్ళు చంద్రబాబు ముందు వ్యక్తంచేస్తున్నారట. ఎట్టి పరిస్థితుల్లోనూ అమిత్ షా పెట్టిన కండీషన్ను ఆమోదించవద్దని తమ్ముళ్ళు ఒత్తిడి పెడుతున్నట్లు సమాచారం. తమ్ముళ్ళదేముంది బీజేపీతో పొత్తు వద్దని చాలా ఈజీగా చెప్పేస్తారు. కానీ, అసలు సమస్యంతా చంద్రబాబుదే కదా. కేంద్రంలో నరేంద్రమోడీ, రాష్ట్రంలో జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే తన భవిష్యత్తు ఏమిటో చంద్రబాబుకు ఈస్ట్ మెన్ కలర్లో స్పష్టంగా కనబడుతోంది.
ఇప్పుడు చంద్రబాబు సమస్య ఏమిటంటే.. బీజేపీతో పొత్తువద్దని చెప్పలేరు అలాగని అమిత్ షా అడిగనన్ని సీట్లు ఇవ్వలేరు. అడిగినన్ని సీట్లివ్వకపోయినా ఎన్నోకొన్నయితే ఇవ్వక తప్పదు. సీట్ల సర్దుబాటును జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో చేసుకున్నంత ఈజీగా బీజేపీతో కూడా చేసేయొచ్చని చంద్రబాబు అనుకున్నట్లున్నారు. కానీ, దిగిన తర్వాత తెలుస్తోంది లోతెంతో. పైగా ఇప్పుడప్పుడే పొత్తు విషయాన్ని బీజేపీ తేల్చేట్లు లేదు. అందుకనే చంద్రబాబును బీజేపీ గట్టిగా ఫిక్స్ చేసేసిందనే ప్రచారం బాగా పెరిగిపోతోంది.