టీడీపీలో వైసీపీ ఎమ్మెల్యేలు చిచ్చుపెడుతున్నారా..?

టికెట్ దక్కని వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరాలని ప్రయత్నిస్తున్న నియోజకవర్గాల్లో ఇలాంటి గొడవలు పెరిగిపోతున్నాయి. ఆల్రెడీ వెంకటగిరి, నెల్లూరు రూరల్, తాడికొండ, ఉదయగిరి నియోజకవర్గాల్లో తమ్ముళ్ళతో గొడవలువున్నాయి.

Advertisement
Update:2024-02-05 11:07 IST

రాజకీయాలు చాలా విచిత్రంగా తయారవుతున్నాయి. ఏ రోజు, ఏ ఎమ్మెల్యే, ఏ పార్టీలో ఉంటున్నారో కూడా అర్థం కావటంలేదు. ఎన్నికల దగ్గరకు వచ్చేస్తున్నాయి కదా.. ఈ గోడదూకుళ్ళు మరింత జోరందుకుంటున్నాయి. శనివారం వరకు వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న వసంత కృష్ణప్రసాద్ సడన్‌గా ఆదివారం టీడీపీ నేతలతో భేటీ అయ్యారు. తొందరలోనే తెలుగుదేశంపార్టీలో చేరి ఎన్నిక‌ల్లో పోటీచేయబోతున్నట్లు ప్రచారం పెరిగిపోతోంది. ఈ నేప‌థ్యంలోనే వసంత మద్దతుదారులపై ప్రభుత్వం వేటువేసింది.

సుమారు 28 మంది ఎమ్మెల్యే మద్దతుదారులును ప్రభుత్వం వివిధ పోస్టుల నుండి తొల‌గించింది. ఈ యాక్షన్ తో వసంత టీడీపీలోకి వెళ్ళటం ఖాయమని అర్థ‌మైపోతోంది. టీడీపీలోకి వెళ్ళటాన్ని పక్కనపెట్టేస్తే మైలవరం నుండి పోటీచేయబోతున్నట్లు ప్రచారం మొదలవ్వటమే పెద్ద సమస్య. ఎందుకంటే ఇక్కడ నుండి మాజీమంత్రి దేవినేని ఉమ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఈయనకు టికెట్ ఇవ్వద్దని ఇప్పటికే పార్టీలో చాలామంది వ్యతిరేకులు తయారయ్యారు. వీళ్ళకి మద్దతుగా వసంత కూడా తోడవ్వబోతున్నారు. అంటే వసంత టీడీపీలో చేరికతో దేవినేని టికెట్ కు ఎసరొచ్చినట్లే.

ఇంతకుముందు పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థ‌సారధి కారణంగా ఆ నియోజకవర్గంలో గొడవలు మొదలయ్యాయి. కొలుసుకు టికెట్ ఖాయమని సంకేతాలు రాగానే మాజీ ఎమ్మెల్యే, సీనియర్ తమ్ముడు బోడె ప్రసాద్ గొడవ మొదలుపెట్టేశారు. తనను కాదని కొలుసుకు టికెట్ ఎలాగిస్తారో చూస్తానంటూ నానా రచ్చ మొదలుపెట్టారు. బోడె దెబ్బకు జడిసిపోయిన చంద్రబాబు వెంటనే కొలుసును నూజివీడుకు బదిలీచేశారు. వెంటనే ఇక్కడ టికెట్ ఆశిస్తున్న ముద్దరబోయిన వెంకటేశ్వరరావు గట్టిగా తగులుకున్నారు.

తిరువూరు వైసీపీ ఎమ్మెల్యే రక్షణనిధి టీడీపీలో చేరి టికెట్ తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అయితే ఇక్కడ నేతలు రక్షణనిధిని పార్టీలో చేర్చుకుంటే ఒప్పుకునేదిలేదని చంద్రబాబుకు గట్టిగా చెబుతున్నారు. టికెట్ దక్కని వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరాలని ప్రయత్నిస్తున్న నియోజకవర్గాల్లో ఇలాంటి గొడవలు పెరిగిపోతున్నాయి. ఆల్రెడీ వెంకటగిరి, నెల్లూరు రూరల్, తాడికొండ, ఉదయగిరి నియోజకవర్గాల్లో తమ్ముళ్ళతో గొడవలువున్నాయి. ఐదేళ్ళు పవర్ ను ఎంజాయ్ చేసి చివరి నిమిషంలో వైసీపీలో టికెట్లు దక్కనికారణంగా టీడీపీలో చేరితే టికెట్లు ఎలా ఇస్తారంటూ తమ్ముళ్ళు చంద్రబాబును నిలదీస్తున్నారు. జనసేనలో కూడా ఇలాంటి గొడవలే ఉన్నా.. ఆ పార్టీలో టీడీపీ తమ్ముళ్ళంతా ముదురు టెంకలు లేరు. అందుకనే బాలశౌరి లాంటి వాళ్ళకి చెల్లుబాటైపోతోంది. మరి గోడ దూకే వైసీపీ ఎమ్మెల్యేలకు చంద్రబాబు టికెట్లు ఎలా సర్దుబాటు చేస్తారో చూడాలి.

Tags:    
Advertisement

Similar News