ఇద్దరు కలిసే కాపులను దెబ్బకొట్టారా..?

ఏదో మొహమాటానికి 25 లేకపోతే 30 సీట్లో తీసుకుంటే కాపు సామాజికవర్గం అంగీకరించదని, కాపుల ఓట్లు టీడీపీకి బదిలీకావని అంటూనే ఉన్నారు.

Advertisement
Update:2024-02-06 12:41 IST

చంద్రబాబు నాయుడుతో కలిసి పవన్ కల్యాణ్ కాపులను వెన్నుపోటు పొడిచారా..? కోలుకోలేనంతగా దెబ్బకొట్టారా..? కాపు కురువృద్ధనేత, మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య పవన్ కు మ‌రోసారి లేఖ రాశారు. అందులోని అంశాలు చదివితే ఎవరికైనా ఇదే అర్థ‌మవుతుంది. మొదటినుండి జోగయ్య చెబుతూనే ఉన్నారు ఎన్నికల్లో పోటీకి జనసేన కనీసం 50-60 సీట్ల మధ్య తీసుకోవాలని. ముఖ్యమంత్రి కుర్చీని పవన్ రెండున్నర సంవత్సరాలు పంచుకోవాలని కాపులు కోరుకుంటున్నట్లు హెచ్చరిస్తూనే ఉన్నారు.

ఏదో మొహమాటానికి 25 లేకపోతే 30 సీట్లో తీసుకుంటే కాపు సామాజికవర్గం అంగీకరించదని, కాపుల ఓట్లు టీడీపీకి బదిలీకావని అంటూనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డిని అధికారంలో నుండి దింపటం అంటే చంద్రబాబును కూర్చోబెట్టడంగా కాపులు భావించటంలేదని మొత్తుకుంటునే ఉన్నారు. పవ‌న్ ముఖ్యమంత్రి అవటమే కాపుల ఆకాంక్షగా, అప్పుడు మాత్రమే కాపులకు రాజ్యాధికారం వచ్చినట్లవుతుందని చెబుతున్నారు. జోగయ్య మాటలే, మొత్తుకోవటాలే కాకుండా కాపుల్లోని మరికొందరు కూడా జనసేన తక్కువలో తక్కువ 50 సీట్లలో పోటీచేయాల్సిందే అని అన్నారు. ఈమధ్య పవన్ నేతలతో మాట్లాడుతూ మొత్తం సీట్లలో జనసేన మూడోవంతు పోటీచేస్తుందన్నారు.

పవన్ లెక్కప్రకారమే మూడోవంతు అంటే 175 సీట్లలో 58 సీట్లు. అయితే ఇంతకుముందు తాను చెప్పిన మాటను పవన్ పక్కనపెట్టి 25 (28?) సీట్లకు ఒప్పేసుకున్నారు. జనసేనకు చంద్రబాబు ఎలాగూ ఎక్కువ సీట్లివ్వరని అందరూ అనుకుంటున్నదే. అయితే బేరమాడి ఎక్కువ సీట్లు సాధించాల్సిన బాధ్యత పవన్ పైనుంది. ఇక్కడే పవన్ పైన కాపు సమాజంలో అనుమానాలు పెరిగిపోతున్నాయి.

కాపులను దెబ్బకొట్టడంలో చంద్రబాబుతో పవన్ కూడా కలిసిపోయారనే ప్రచారం పెరిగిపోతోంది. పవన్ స్వయంగా కాపు అయ్యుండి సామాజికవర్గాన్ని దెబ్బకొట్టేట్లుగా ఎలా వ్యవహరిస్తున్నారనే అర్థం జోగయ్య లేఖలో ధ్వనిస్తోంది. సీట్ల పంపకాలు సరిగా జరగకపోయినా కాపులకు అన్యాయం చేయటం ద్వారా ఓట్ల బదిలీ జరగకపోయినా అందుకు పవన్, చంద్రబాబే బాధ్యత వహించాలని జోగయ్య ఘాటుగానే లేఖ రాశారు. పవన్ను ముఖ్యమంత్రిగా చూడాలన్న స్ట్రాంగ్ సపోర్టర్ జోగయ్య లేఖ అంత ఘాటుగా ఉందంటే ఇక మిగిలిన ప్రముఖుల ఆలోచనలు ఎలాగ ఉంటాయో అనే ఆసక్తి పెరిగిపోతోంది. మెల్లిగా అందరూ బయటపడేట్లుగా ఉన్నారు. చివరకు ఏమవుతుందో చూడాలి.

Tags:    
Advertisement

Similar News