మోదీ సభకు వెళ్లే బస్సుల్ని జగన్ అడ్డుకున్నారా..?
ఎమ్మార్పీఎస్ నేతలు మాత్రం ఉద్దేశపూర్వకంగానే బస్సుల్ని రద్దు చేశారంటున్నారు. ప్రస్తుతానికి దీనిపై ఎల్లో మీడియా రాద్ధాంతం మొదలు పెట్టింది. మోదీని ధిక్కరించిన జగన్, మోదీ సభలకు బస్సుల్ని ఆపేసిన జగన్ అంటూ కథనాలిస్తోంది.
తెలంగాణలో ఈరోజు జరగబోతున్న మాదిగల విశ్వరూప మహాసభకు ఏపీనుంచి కూడా ఆ వర్గం నేతలు హాజరవుతున్నారు. ప్రధాని మోదీ ఈ సభకు ముఖ్య అతిథి కావడంతో మాదిగ వర్గం నేతలు భారీ జనసమీకరణకు ప్రయత్నాలు చేశారు. అయితే ఏపీ నుంచి బుక్ చేసుకున్న ఆర్టీసీ బస్సుల్ని చివరి నిమిషంలో ఉద్దేశపూర్వకంగా ఆపేశారనే ఆరోపణలు వినపడుతున్నాయి. అప్పటికే బుక్ చేసుకున్న ఆర్టీసీ బస్సుల్ని క్యాన్సిల్ చేశారని, సీఎం జగన్ కావాలనే తమ సభకు ఆటంకాలు సృష్టిస్తున్నారని, ఎమ్మార్పీఎస్ నేతలు అన్నట్టుగా ఎల్లో మీడియా కథనాలిచ్చింది. అయితే ఇందులో ఏది నిజం..? ఎంత నిజం..? అనేది తేలాల్సి ఉంది.
తెలంగాణలో జరుగుతున్న ప్రధాని మోదీ సభకు ఆటంకాలు సృష్టించాలనే ఆలోచన అసలు ఏపీ సీఎం జగన్ కు ఎందుకు వస్తుంది. ఏపీలో కూడా ప్రధానితోపాటు సీఎం జగన్ చాలా సభల్లో పాల్గొన్నారు. పార్లమెంట్ లో బీజేపీ తీసుకునే నిర్ణయాలకు వైసీపీ మద్దతివ్వడానికి ఎప్పుడూ వెనకాడలేదు. ఇలాంటి పరిస్థితుల్లో మోదీ సభకు ఏపీ బస్సుల్ని ఆపేసేలా జగన్ నిర్ణయం తీసుకుంటారా అనేదే ప్రశ్నార్థకం.
అసలేం జరిగింది..?
ప్రకాశం జిల్లాలో గిద్దలూరు, మార్కాపురం, యర్రగొండపాలెం, కడప తదితర ప్రాంతాల నుంచి శుక్రవారం రాత్రి బయలుదేరి సికింద్రాబాద్ కి వెళ్లేందుకు ఆర్టీసీ బస్సుల్ని ఎమ్మార్పీఎస్ నేతలు బుక్ చేసుకున్నారు. అయితే చివరి నిమిషంలో వాటిని రద్దుచేశారు. ఈ సభకు బస్సులు పంపవద్దని, స్పెషల్ బుకింగ్స్ రద్దు చేయాలనే ఆదేశాలున్నాయని, ఆయా డిపోల అధికారులు పేర్కొన్నట్లు ఎమ్మార్పీఎస్ నేతలు చెప్పారు. బస్సుల రద్దు విషయంలో మార్కాపురం డిపోలో గొడవ కూడా జరిగినట్టు తెలుస్తోంది. దీంతో ఎమ్మార్పీఎస్ నేతలంతా ప్రత్యామ్నాయ బస్సుల్లో అక్కడికి వెళ్లాల్సి వచ్చింది.
ఆర్టీసీ అధికారులు ఏం చెబుతున్నారంటే..?
ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రత్యేక బస్సుల బుకింగ్ జరగలేదని తెలిపారు. అటు ఎమ్మార్పీఎస్ నేతలు మాత్రం ఉద్దేశపూర్వకంగానే బస్సుల్ని రద్దు చేశారంటున్నారు. ప్రస్తుతానికి దీనిపై ఎల్లో మీడియా రాద్ధాంతం మొదలు పెట్టింది. మోదీని ధిక్కరించిన జగన్, మోదీ సభలకు బస్సుల్ని ఆపేసిన జగన్ అంటూ కథనాలిస్తోంది. నిజానిజాలేంటో వైసీపీ నేతలు స్పందిస్తే కానీ తెలియదు.