సీఎంఓ ఫైళ్లకు నిప్పు.. అసలు నిజమేంటి..?
కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంత తీరిగ్గా ఇప్పుడు ఆ ఫైళ్లను ఎందుకు బయటకు తెచ్చారు, అసలు వాటిలో కీలక సమాచారమేదైనా ఉందా, హార్డ్ డిస్క్ లలో ఏముంది..? అనేది ఆసక్తిగా మారింది.
ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థకు చెందిన కొన్ని ఫైళ్లను అర్థరాత్రి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టారనే వార్త సంచలనంగా మారింది. గతంలో కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ గా పనిచేసిన సమీర్ శర్మ సూచనతోనే ఈ పని చేశామంటూ కారు డ్రైవర్ ఒప్పుకున్నట్టుగా టీడీపీ నేతలు చెబుతున్నారు. అయితే పోలీస్ విచారణలోనే అసలు విషయాలు బయటపడే అవకాశముంది. ప్రస్తుతానికి కాలిపోయిన ఫైళ్లలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఫొటో కనపడటం హాట్ టాపిక్ గా మారింది.
కాలిపోతున్న ఫైళ్లు, హార్డ్ డిస్క్ ల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ వీడియోలను చూపెడుతూ టీడీపీ నేతలు హంగామా చేశారు. పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ కాలిపోయిన ఫైళ్లను పరిశీలించారు, వైసీపీ నేతలపై విమర్శలు ఎక్కుపెట్టారు. పాపాలన్నీ బయటపడి జైలుకి వెళ్లే పరిస్థితి వస్తుందని వైసీపీ నేతల్లో భయం మొదలైందని, అందుకే ఆ పాపాల ఆనవాళ్లు బయటకు రాకుండా ఇలా తగలబెడుతున్నారని ఆరోపించారు టీడీపీ నేతలు.
ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంత తీరిగ్గా ఇప్పుడు ఆ ఫైళ్లను ఎందుకు బయటకు తెచ్చారు, అసలు వాటిలో కీలక సమాచారమేదైనా ఉందా, హార్డ్ డిస్క్ లలో ఏముంది..? అనేది ఆసక్తిగా మారింది. ఈ ఫైళ్ల వ్యవహారంపై వైసీపీ స్పందించాల్సి ఉంది. అధికారం మీచేతిలోనే ఉంది కదా విచారణ చేయించుకోండి అంటూ వైసీపీ నేతలు బదులిచ్చే అవకాశముంది. ప్రస్తుతానికి పెద్దిరెడ్డిని టార్గెట్ చేస్తూ టీడీపీ విమర్శలు మొదలు పెట్టింది. ఈ వ్యవహారం ఏమ మలుపు తిరుగుతుందో చూడాలి.