‘జగనన్న మళ్లీ రావాలి.. లేకపోతే మా చదువులు అటకెక్కుతాయి’

ప్రాథమిక పాఠశాల విద్యార్థుల నుంచి మొదలు పెడితే ఇంజనీరింగ్‌, మెడిసిన్‌, డిగ్రీ విద్యార్థుల వరకు, ముఖ్యంగా పేద, మధ్య తరగతి కుటుంబాల నుంచి వచ్చిన పిల్లల్లో వైఎస్‌ జగన్‌ మీద అనంతమైన అభిమానం వ్యక్తమవుతోంది.

Advertisement
Update:2024-03-01 16:37 IST

జగనన్నే మళ్లీ రావాలి, ఆయన రాకపోతే తమ చదువులు అటకెక్కుతాయని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని విద్యార్థులు అంటున్నారు. రాష్ట్రంలోని ఏ మూలకు వెళ్లినా స్టూడెంట్స్‌ నుంచి అదే మాట వినిపిస్తోంది. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబాల నుంచి వచ్చిన తాము ధైర్యంగా ముందుకు వచ్చి చదువుకోగలుగుతున్నామంటే జగన్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా దీవెన‌, వ‌స‌తి దీవెన‌ పథకాలే కారణమని వారంటున్నారు. జగన్‌ తిరిగి అధికారంలోకి రాకపోతే తమ చదువులు దెబ్బ తింటాయనే ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది.

ప్రాథమిక పాఠశాల విద్యార్థుల నుంచి మొదలు పెడితే ఇంజనీరింగ్‌, మెడిసిన్‌, డిగ్రీ విద్యార్థుల వరకు, ముఖ్యంగా పేద, మధ్య తరగతి కుటుంబాల నుంచి వచ్చిన పిల్లల్లో వైఎస్‌ జగన్‌ మీద అనంతమైన అభిమానం వ్యక్తమవుతోంది. అవకాశం వచ్చిన ప్రతిసారీ వారు జగన్‌ పట్ల తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. జగన్‌ పొల్గొన్న బహిరంగ సభల్లో ఆయన సమక్షంలోనే విద్యార్థినీవిద్యార్థులు తమ అభిమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. వాళ్లు చెబుతున్న మాటలు వినేవాళ్లను ఉద్వేగభరితులను చేస్తున్నాయి.

పిల్లలే కాదు, వారి తల్లిదండ్రులు కూడా జగన్‌పై తమకు ఉన్న ప్రేమానురాగాలను వెల్లడిస్తున్నారు. పేదరికం కారణంగా తమ పిల్లల చదువులకు స్వస్తి చెప్పడానికి సిద్ధమైన స్థితిలో జగన్‌ అధికారంలోకి వచ్చారని, ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన వివిధ పథకాల వల్ల తమ పిల్లలు డిగ్రీలు, ఇంజనీరింగ్‌, మెడిసిన్‌ చదవగలుగుతున్నారని, అది వైఎస్‌ జగన్‌ చలువేనని వారు చెప్పుతున్నారు.

జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగంలో ప్రవేశపెట్టిన సంస్కరణలు విద్యావేత్తలు, సామాజిక శాస్త్రవేత్తల ప్రశంసలు అందుకుంటున్నాయి. ఇంతటి సంస్కరణలు గతంలో ఎప్పుడూ చూడలేదని అంటున్నారు. నాడు-నేడు కార్యక్రమంతో రాష్ట్రంలోని మెజారిటీ స్కూళ్ల రూపురేఖలు మారిపోయాయి. అమ్మ ఒడి పథకం ఆర్థికంగా భరోసా కల్పిస్తుంటే, జగనన్న విద్యా కానుక ద్వారా పిల్లలకు బూట్లు, యూనిఫామ్స్‌, పుస్తకాలు ఉచితంగా అందుతున్నాయి. ఆణిముత్యాలు పథకం కింద ఉన్నత విద్య కోసం విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందుతున్నాయి. కార్పోరేట్‌ రంగంలోని ప్రైవేట్‌ పాఠశాలలకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఆధునిక మౌలిక వసతులు ప్రభుత్వ పాఠశాలల్లోనూ కనిపిస్తున్నాయి.

విద్యా దీవెన, వసతి దీవెన వంటి పథకాలు విప్లవాత్మకమైన మార్పులకు దోహదం చేశాయి. విద్యారంగంలో ప్రస్తుత పరిస్థితులు ఇదే విధంగా కొనసాగితే ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలుస్తుంది. దేశీయ ఉన్నత విద్యను మాత్రమే కాకుండా విదేశీ విద్యావకాశాలను కూడా అందిపుచ్చుకునే విధంగా జగన్‌ ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోంది.

Tags:    
Advertisement

Similar News