నేడే ఏపీలో పోలింగ్.. 83 శాతం ఈసీ టార్గెట్..
రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో 26 జిల్లాలకు సంబంధించి 26 మానిటర్లలో ఓటింగ్ సరళిని పర్యవేక్షిస్తున్నారు అధికారులు. దాదాపు 150 మంది అధికారులు, సిబ్బంది నిరంతరాయంగా ఇదే పనిలో ఉంటారు.
ఏపీలో పోలింగ్ ఈసారి మరింత మెరుగవుతుందని చెప్పారు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా. గత ఎన్నికల్లో 79.84 శాతం ఓటింగ్ నమోదు కాగా, ఈ ఎన్నికల్లో 83 శాతం ఓటింగ్ లక్ష్యంగా విస్తృత స్థాయిలో ఓటర్లను చైతన్య పరచే కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అప్రమ్తతం చేశామని చెప్పారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు అవసరమైన కనీస వసతులు కల్పించామని, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్య వ్యవస్థ పరిరక్షణకు, ధృడమైన ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పాటుకు ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా జరిగే ఎన్నికలు ఎంతో కీలకమని ఆయన వివరించారు.
రాష్ట్రంలో మొత్తం ఓటర్లు 4,14,01,887
పురుషులు 2,03,39,851
మహిళలు 2,10,58,615
ట్రాన్స్ జెండర్స్ 3,421
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పోలింగ్ కేంద్రాలు 46,389
సమస్యాత్మకంగా గుర్తించినవి 12,438
పూర్తి స్థాయి వెబ్ క్యాస్టింగ్ ఉన్న కేంద్రాలు 31,385
ఉపయోగిస్తున్న ఈవీఎంలు 1.60 లక్షలు
బరిలో ఉన్న అభ్యర్థులు
25 పార్లమెంట్ స్థానాలకు 454 మంది
175 అసెంబ్లీ స్థానాలకు 2,387 మంది
ఏపీలో ఈసారి ఎన్నికలు పోటా పోటీగా సాగే అవకాశాలున్నాయి. అటు అధికార వైసీపీ, ఇటు ప్రతిపక్ష కూటమి గెలుపుపై ధీమాగా ఉన్నాయి. ప్రతిష్టాత్మక పోరులో ఏ చిన్న అవకాశాన్ని కూడా ఎవరూ వదిలిపెట్టేలా లేరు. కొన్నిచోట్ల అప్పుడే గొడవలు మొదలయ్యాయి. ఏజెంట్ల విషయంలో ఘర్షణలు జరిగాయి, వెబ్ క్యాస్టింగ్ కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల వైర్లను కట్ చేసిన ఉదాహరణలున్నాయి. దీంతో అధికారులు భద్రత మరింత కట్టుదిట్టం చేశారు. జీరో వయొలెన్స్ లక్ష్యంగా పర్యవేక్షణ చేస్తున్నారు. రాష్ట్రంలో ఏ జిల్లాకు ఆ జిల్లాలో కమాండ్ కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేసి వెబ్ క్యాస్టింగ్ ద్వారా పరిస్థితుల్ని మానిటరింగ్ చేస్తున్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో 26 జిల్లాలకు సంబంధించి 26 మానిటర్లలో ఓటింగ్ సరళిని పర్యవేక్షిస్తున్నారు అధికారులు. దాదాపు 150 మంది అధికారులు, సిబ్బంది నిరంతరాయంగా ఇదే పనిలో ఉంటారు.