ఐపీఎస్ లపై పార్టీ రాజముద్ర.. వారి భవిష్యత్ ఏంటి..?

అపోజిషన్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు తమకు నచ్చనివారికి అప్రధాన పోస్ట్ లు ఇవ్వడం పరిపాటి. కానీ టీడీపీ ఇప్పుడు బరితెగించింది. 16 మంది ఐపీఎస్ అధికారులకు అసలు పోస్టింగ్ లే ఇవ్వకుండా వేధిస్తోంది.

Advertisement
Update:2024-08-18 08:11 IST

అధికార మార్పిడి జరిగినప్పుడల్లా అధికారుల మార్పిడి కూడా జరుగుతుంది. ఇందులో వింత, విశేషం ఏమీ లేదు. ఇటీవల తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ నియామకాల్లో చాలా చోట్ల మార్పులు, చేర్పులు జరిగాయి. అంతా స్మూత్ గా జరిగిపోయింది కానీ రాజకీయ దుమారం పెద్దగా లేదు. కానీ ఏపీలో మాత్రం టీడీపీ ప్రభుత్వం దారుణంగా ప్రవర్తించింది. 16మంది ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్ ఇవ్వకుండా వారిని డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేసింది. దీంతో రాజకీయ దుమారం రేగింది. అక్కడితో ఆగకుండా ఆ 16మందికి రాజకీయ దురుద్దేశాలు అంటగడుతూ వారిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది.

ఆ ఐపీఎస్ అధికారులు గతంలో ఏమేం చేశారు, ఎందుకు వారికి పోస్టింగ్ లు ఇవ్వలేదనే విషయాన్ని టీడీపీ సానుభూతిపరులు కొందరు సోషల్ మీడియాలో పెట్టారు. వారికి పోస్టింగ్ లు ఇవ్వకుండా నిర్ణయం తీసుకున్న డీజీపీకి అభినందనలు అంటూ కామెంట్లు పెట్టారు. పనిలో పనిగా వైసీపీపై కూడా బురదజల్లడంతో ఆ పార్టీ దీనికి కౌంటర్ ఇవ్వాల్సి వచ్చింది. 

ఇంతవరకు భారత దేశంలో ఎప్పుడూ లేని కొత్త సాంప్రదాయానికి టీడీపీ తెరతీసింది. ఏ పార్టీ అధికారంలో ఉంటే పోలీసులు వారికి అనుకూలంగా చేయాల్సిన పరిస్థితులు ఈ దేశంలో ఉన్నాయి. అపోజిషన్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్లకు అప్రధాన పోస్ట్ లు ఇవ్వడం ఇప్పటి వరకు జరుగుతూ వచ్చింది. అయితే ఇప్పుడు టీడీపీ కొద్దిగా బరితెగించి 16 మంది ఐపీఎస్ అధికారులను అమానుషంగా వేధించడం మొదలు పెట్టింది. ఇది ఏ ప్రభుత్వానికీ శ్రేయస్కరం కాదు. రేపు మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే ఇప్పుడు కీలకంగా ఉన్న అధికారుల్ని, వ్యవస్థలో మార్పులకు కారణమైన వారిని.. ఇంతకంటే దారుణంగా వేధించవచ్చు.

 గతంలో ఎప్పుడూ ఇలాంటి సంప్రదాయాలు లేవు. వైఎస్ రాజేశేఖర్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అప్పటి వరకు చంద్రబాబు ప్రభుత్వంలో ఇబ్బందులు పడ్డ అధికారులు, వ్యక్తులు, నాయకులు.. రాజశేఖర్ రెడ్డిని కలిశారు. తమను ఇబ్బంది పెట్టిన చాలామంది అధికారులపై వైఎస్ఆర్ కి ఫిర్యాదు చేశారు. వారిపై కక్ష తీర్చుకోవాలన్నట్టుగా ఆయనకు చెప్పారు. అప్పుడు రాజశేఖర్ రెడ్డి వారితో చెప్పిన మాటలు ఇప్పటికీ చాలామంది అధికారులు గుర్తు చేసుకుంటారు. "ప్రభుత్వం మారగానే కొత్త అధికారులు ఆకాశాన్నుంచి ఊడిపడరు. ఉన్న అధికారులతోనే మనం పనిచేయించుకోవాలి. ఉన్న వారిని మనకు అనుకూలంగా మన విధానాలను అమలు పరిచేలా ఆదేశించగలం కానీ, కక్షలు, కార్పణ్యాలు మంచి పద్ధతి కాదు" అని చెప్పారు. ఇలాంటి స్టేట్స్ మన్ షిప్ చంద్రబాబు నుంచి ఆశించడం అత్యాశే.

Tags:    
Advertisement

Similar News