సుప్రీంకోర్టు తిరస్కరించిన కేసులో ఎఫ్ఐఆర్ ఏంటి..?
ఇది ముమ్మాటికీ రాజకీయ కక్షసాధింపేనంటూ వైసీపీ విమర్శలు చేస్తోంది. ఈ క్రమంలో సీఐడీ మాజీ డీజీ సునీల్ కుమార్ ఆసక్తికర ట్వీట్ వేశారు.
తనపై దాడి చేశారని, చంపాలని ప్రయత్నించారంటూ టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు చేసిన ఫిర్యాదుపై ఏపీ పోలీసులు కేసు నమోదు చేయడం, ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయడం సంచలనంగా మారింది. అప్పటి సీఐడీ డీజీ పీవీ సునీల్ కుమార్ ని ఈ కేసులో ఏ-1 గా చేర్చడంతోపాటు, ఇంటెలిజెన్స్ మాజీ డీజీ పీఎస్‌ఆర్ ఆంజనేయులుని ఏ-2గా, మాజీ ముఖ్యమంత్రి జగన్ ని ఏ-3గా, అప్పటి సీఐడీ ఏఎస్పీ విజయ్‌పాల్ ని ఏ-4గా ఎఫ్ఐఆర్ లో చేర్చడంతో మరింత కలకలం రేగింది. ఇది ముమ్మాటికీ రాజకీయ కక్షసాధింపేనంటూ వైసీపీ విమర్శలు చేస్తోంది. ఈ క్రమంలో సీఐడీ మాజీ డీజీ సునీల్ కుమార్ ఆసక్తికర ట్వీట్ వేశారు.
రఘురామకృష్ణంరాజు ఫిర్యాదు ఇప్పటిది కాదు. 2021 మే 14న ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ఫిర్యాదుపై పోలీసులు స్పందించలేదంటూ అప్పట్లో సుప్రీంకోర్టుని కూడా ఆశ్రయించారు. సుప్రీం కోర్టులో ఆ కేసు మూడేళ్ళు నడిచింది. చివరకు కోర్టు ఆ కేసుని తిరస్కరించింది. అప్పుడు సుప్రీంకోర్టు తిరస్కరించిన కేసులో కొత్తగా FIR నమోదు చేయడాన్ని ఏ విధంగా చూడాలని సూటిగా ప్రశ్నించారు ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్. అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పారు.
అప్పట్లో రఘురామ కృష్ణంరాజు అరెస్ట్, కస్టడీ, బెయిల్ వ్యవహారం తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం మారగానే అప్పటి నిందితుడు ఇప్పుడు బాధితుడిగా మారిపోవడం విశేషం. ఏకంగా జగన్ పేరుని కూడా ఎఫ్ఐఆర్ లో చేర్చడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఇప్పటికే ఇద్దరు వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు వేర్వేరు కేసులతో జైలులో ఉన్నారు. మరికొందరిపై కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు నేరుగా జగన్ తోపాటు, ఐపీఎస్ అధికారి, ఇతర అధికారులపై కేసులు నమోదు కావడం సంచలనంగా మారింది దీని పర్యవసానాలు ఎలా ఉంటాయో చూడాలి.