శ్రీదేవి ఆఫీస్ పై దాడి.. మేకపాటి దిష్టిబొమ్మ దహనం..

నెల్లూరు జిల్లాలోని వింజమూరులో ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి వ్యతిరేకంగా రోడ్లపైకి వచ్చారు వైసీపీ నాయకులు, కార్యకర్తలు. ఆయన దిష్టిబొమ్మ దహనం చేశారు.

Advertisement
Update:2023-03-24 21:48 IST

ఏపీలో రాజకీయం వేడెక్కింది. వైసీపీ అంతర్గత రాజకీయాలు రోడ్డెక్కాయి. ఆ పార్టీ నలుగురు ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేసిన గంటల వ్యవధిలోనే ఇద్దరు ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా స్థానిక నాయకులు ఆందోళన చేపట్టారు. తాడికొండలో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఆఫీస్ పై దాడి జరిగింది. ఆఫీస్‌ ముందు ఉన్న ఫ్లెక్సీలు, బ్యానర్లు చించేశారు. వైసీపీ నేతలే ఈ దాడికి పాల్పడ్డారని శ్రీదేవి అనుచరులు ఆరోపిస్తున్నారు. కొంతమంది ఆఫీస్ లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. శ్రీదేవిపై సస్పెన్షన్ వేటు వేసినట్టు పార్టీ ప్రకటించిన వెంటనే ఈ దాడి జరగడం గమనార్హం.




ఇటు నెల్లూరు జిల్లాలోని వింజమూరులో ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి వ్యతిరేకంగా రోడ్లపైకి వచ్చారు వైసీపీ నాయకులు, కార్యకర్తలు. ఆయన దిష్టిబొమ్మ దహనం చేశారు. పార్టీకి వెన్నుపోటు పొడిచిన మేకపాటిపై చర్యలు తీసుకోవడం సరైన చర్య అని హర్షం వ్యక్తం చేశారు. మేకపాటి పీడ పార్టీకి విరగడైపోయిందంటూ బాణసంచా కాల్చారు.




ఇక పార్టీకి కొన్నాళ్లుగా దూరంగా ఉంటున్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి సస్పెన్షన్ వ్యవహారంలో పెద్దగా నిరసనలేవీ వ్యక్తం కాలేదు. శ్రీధర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు వేసిన రోజే, ఆయన సోదరుడు గిరిధర్ రెడ్డి టీడీపీలో చేరడం విశేషం. ఇక ఆనం మాత్రం గుంభనంగానే ఉన్నారు. సస్పెన్షన్ పై ఆయన ఎక్కడా స్పందించలేదు. కోటంరెడ్డి మాత్రం సస్పెన్షన్ వేటు అప్రజాస్వామికం అని మండిపడ్డారు.

అనర్హత వేటు వేస్తారా..?

ఎమ్మెల్సీ ఎన్నికల్లో విప్ ధిక్కరించారని పార్టీనుంచి సస్పెండ్ చేసిన నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తారా, దానికోసం స్పీకర్ కి పార్టీ నేతలు ఫిర్యాదు చేస్తారా అనేది తేలాల్సి ఉంది. నాలుగు స్థానాల్లో మూడుచోట్ల ఇప్పటికే ప్రత్యామ్నాయాలను వైసీపీ అధిష్టానం వెదికి పెట్టింది. ఉదయగిరి నియోజకవర్గంలో మాత్రం చంద్రశేఖర్ రెడ్డి స్థానంలో మరో బలమైన అభ్యర్థికోసం వెదుకుతోంది.

Tags:    
Advertisement

Similar News