పవన్ కల్యాణ్ ని దువ్వుతున్న చంద్రబాబు..

పవన్ కల్యాణ్ పై తనకు వన్ సైడ్ లవ్ ఉందని ఆమధ్య కుప్పంలో చెప్పిన చంద్రబాబు, ఆ తర్వాత కొన్నాళ్లపాటు సైలెంట్ అయ్యారు. మళ్లీ ఇప్పుడు పవన్ ని దగ్గర చేసుకోడానికి మెల్లగా దువ్వుతున్నారు.

Advertisement
Update:2022-08-20 15:32 IST

ఆ మధ్య టీడీపీ మహానాడు తర్వాత చంద్రబాబులో కాసింత గర్వం తొణికిసలాడింది. ఆహా ఓహో అంటూ వందిమాగధులు చేసిన హడావిడికి ఆయన పొంగిపోయారు. మనకు ఎవరి పొత్తూ అక్కర్లేదన్నట్టుగా మాట్లాడారు. కట్ చేస్తే... ఇప్పుడు చంద్రబాబులో మళ్లీ భయం మొదలైంది. వరుసగా విడుదలవుతున్న సర్వేలన్నీ ఏపీలో వైసీపీదే అధికారం అని ఘంటాపథంగా చెబుతుండటంతో చంద్రబాబు మళ్లీ పొత్తులకోసం వెంపర్లాడుతున్నారు. అందులో భాగంగానే రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి మద్దతిచ్చారు. ఇటు జనసేన కూడా తనతో కలసి నడిచేలా వ్యూహ రచన చేస్తున్నారు.

పవన్ పై అభిమానం పొంగుకొచ్చిందా..?

పవన్ కల్యాణ్ పై తనకు వన్ సైడ్ లవ్ ఉందని ఆమధ్య కుప్పంలో చెప్పిన చంద్రబాబు, ఆ తర్వాత కొన్నాళ్లపాటు సైలెంట్ అయ్యారు. మళ్లీ ఇప్పుడు పవన్ ని దగ్గర చేసుకోడానికి మెల్లగా దువ్వుతున్నారు. కులం పేరుతో పవన్‌ కల్యాణ్‌ ను, జనసేన పార్టీని తిడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఏపీలో ఇవేం కులరాజకీయాలంటూ ప్రశ్నించారు. ముఖ్యంగా పవన్ కల్యాణ్ ని అదే సామాజిక వర్గానికి చెందినవారితో జగన్ తిట్టిస్తున్నారని సింపతీ చూపిస్తున్నారు బాబు. కుల రాజకీయాలను ప్రజలు అర్థం చేసుకోవాలని, కులం పేరుని తీసుకొచ్చేవారిని పక్కనపెట్టాలన్నారు.

ఆమధ్య ఓ మీటింగ్ లో పవన్ కల్యాణ్, కనీసం కులం విషయంలో అయినా అందరూ కలవాలని, తనకి మద్దతివ్వాలని అన్నారు. అలా చెప్పడానికి బాధగా ఉందంటూనే ఆ మాట అనేశారు పవన్. అప్పటినుంచి సందర్భం వచ్చినప్పుడల్లా వైసీపీ, పవన్ పై కులం పేరుతో ఎదురుదాడి చేస్తూనే ఉంది. కుల రాజకీయాలు లేవంటారు, రెల్లి కులం స్వీకరించానంటారు, ఇప్పుడు ఓట్ల విషయానికొచ్చే సరికి కులం కావాల్సి వచ్చిందా అని ప్రశ్నిస్తున్నారు. ఇటీవల 175 సీట్లలో పవన్ కి పోటీ చేసే దమ్ముందా అంటూ రెచ్చగొడుతున్నారు వైసీపీ నేతలు. ఈ మాటలకి పవన్ రెచ్చిపోయి ఒంటరిపోరు అంటారేమో అనేది చంద్రబాబు భయం. అందుకే ఆయన ముందుగా పవన్ ని దువ్వుతున్నారు. పవన్ పై వైసీపీ నేతలు విమర్శలు చేయడం తగద‌ని తెగ ఇదైపోతున్నారు.

సేనానికి ఇష్టం, సైనికులకు కష్టం..

వాస్తవానికి ఏపీలో టీడీపీతో కలసి పనిచేయడం జనసైనికులకు ఇష్టం లేదు, కానీ పవన్ కల్యాణ్ మాత్రం చంద్రబాబుకి మద్దతుగా మాట్లాడటం మానడంలేదు. దీంతో జనసేన కొంత సందిగ్ధంలోనే ఉంది. గతంలో తనకి తానే మూడు ఆప్షన్లు ఇచ్చుకుని, అందులో ఒంటరి పోరుని లాస్ట్ ఆప్షన్ గా చెప్పుకున్నారు పవన్. అంటే రాజకీయాలు ఏ మలుపు తిరిగినా ఒంటరిపోరు అనేది చివరి ఆప్షన్ గా పెట్టుకున్నారు పవన్. వైసీపీకి కావాల్సింది కూడా అదే, త్రిముఖ పోరులో టీడీపీ తీవ్రంగా నష్టపోవాలని జగన్ భావిస్తున్నారు. కానీ పొత్తుతో లాభపడాలనేది చంద్రబాబు ఆలోచన. జగన్ పై ఉన్న అసంతృప్తి ఓట్ల చీలిక ద్వారా నష్టపోకూడదని, టీడీపీపై జనాలకి నమ్మకం లేకపోయినా, జనసేన, బీజేపీ పంచన చేరి, వైసీపీ వ్యతిరేక ఓటుని ఒకే దగ్గరకు చేర్చాలనే ప్లానింగ్ లో ఉన్నారు బాబు. అందుకే అడక్కుండానే పవన్ కి మద్దతుగా మాట్లాడుతున్నారు. ఈ మాయమాటలకు పవన్ పడిపోతారో లేదో చూడాలి.

Tags:    
Advertisement

Similar News