లోకేష్ వెంట వారసుల పరుగులు
ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలు, కోస్తా ఆంధ్ర నుంచి టీడీపీ వారసులు యువగళంని కంటిన్యూగా ఫాలో అవుతున్నారు. వీళ్లందరికీ టికెట్ దక్కించుకోవాలనే యావే తప్పించి, లోకేష్ పాదయాత్ర సక్సెస్ చేయాలనే తలంపే లేదు.
యువగళం పాదయాత్ర రాయలసీమ జిల్లాల్లో సాగుతోంది. నారా లోకేష్ రాజకీయ భవిష్యత్తు కోసం ఈ సుదీర్ఘ పాదయాత్రను తెలుగుదేశం పార్టీ అధిష్టానం డిజైన్ చేసింది. రాష్ట్రంలో చాలావరకూ జిల్లాలు కవర్ అయ్యేలా 400 రోజులు, 4 వేల కిలోమీటర్ల పాదయాత్రని ప్లాన్ చేశారు. తన వారసుడు లోకేష్‌ను రాజకీయంగా సెటిల్ చేసేందుకు, తెలుగుదేశం పార్టీపై పూర్తిస్థాయి ఆధిపత్యం సాధించేందుకు వీలుగా యువగళం ఉండేలా చూసుకున్నారు చంద్రబాబు.
పార్టీపైనా, నేతలపైనా పట్టు పెంచుకుని తన రాజకీయ వారసత్వాన్ని స్థిరత్వం చేసుకోవాలనుకుంటోన్న లోకేష్ వెంట టీడీపీ రాజకీయ వారసులు పరుగులు పెడుతున్నారు. లోకేష్ పాదయాత్ర వెంటే టీడీపీ రాజకీయ వారసులు ఫాలో అవుతున్నారు. స్థానికంగా ఉన్న నియోజకవర్గ ఇన్‌చార్జిలు, అనుబంధ సంఘాలు, నేతలకి తోడు ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారసులతో పాదయాత్ర కళకళలాడుతోంది. లోకేష్ తన రాజకీయ మనుగడ కోసం నడుస్తుంటే, ఆయన వెంటే తమకి తండ్రుల నుంచి వచ్చిన రాజకీయ వారసత్వమైన నియోజకవర్గాలలో సీట్లు కన్ ఫామ్ చేసుకునేందుకు అలుపెరుగని బాటసారుల్లా నడుస్తున్నారు.
ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలు, కోస్తా ఆంధ్ర నుంచి టీడీపీ వారసులు యువగళంని కంటిన్యూగా ఫాలో అవుతున్నారు. వీళ్లందరికీ టికెట్ దక్కించుకోవాలనే యావే తప్పించి, లోకేష్ పాదయాత్ర సక్సెస్ చేయాలనే తలంపే లేదు. అయితే లోకేష్ ఏ నియోజకవర్గంలో పర్యటిస్తే వారి ప్రస్తావనే కానీ, బయట నుంచి వచ్చిన వారసుల వైపు, వారి టికెట్ల ఆబ్లిగేషన్ వైపు దృష్టి సారించడంలేదని సమాచారం. అయినా పట్టువదలని వారసులు పాదయాత్రని వీడటంలేదు. లోకేష్ చూపు తమ మీద పడితే చాలు అన్న చందంగా అక్కడే తిరుగుతున్నారు వారసులు. దివంగత స్పీకర్ బాలయోగి తనయుడు హరీష్, బండారు సత్యనారాయణమూర్తి కొడుకు అప్పలనాయుడితోపాటు టికెట్లు ఆశిస్తున్న తెలుగుదేశం నేతల పిల్లలంతా యువగళంలో కళకళలాడుతున్నారు.