బాబు అలా, జగన్ ఇలా.. ప్రమాణ స్వీకారాలు ఎలా జరిగాయంటే..?

ఈరోజు 172 మంది ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించారు ప్రొటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి. వివిధ కారణాలతో ముగ్గురు సభకు రాలేదు. వారి ప్రమాణ స్వీకారాలతోపాటు, రేపు స్పీకర్ ఎన్నిక జరుగుతుంది.

Advertisement
Update:2024-06-21 14:44 IST

ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారాల కోసం ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. దాదాపు రెండున్నరేళ్ల తర్వాత చంద్రబాబు అసెంబ్లీలో అడుగుపెట్టారని టీడీపీ నేతలు గుర్తు చేసుకున్నారు. ఇది గౌరవ సభ కాదు, కౌరవ సభ అంటూ 2021లో ఆయన అసెంబ్లీని వీడారు, తిరిగి సీఎంగానే సభలో అడుగు పెడతానని శపథం చేశారు. ఈరోజు ఆయన సీఎంగా అసెంబ్లీలో అడుగు పెట్టడంతో టీడీపీ ఎమ్మెల్యేలు నిజం గెలిచిందంటూ.. ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. సభలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను చంద్రబాబు ఆలింగనం చేసుకున్నారు. ముందు సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేగా ప్రమాణం చేయగా, తర్వాత డిప్యూటీ సీఎం పవన్ ప్రమాణం చేశారు. అనంతరం మంత్రులు ఒక్కొక్కరే ప్రమాణాలు చేశారు.

మంత్రుల ప్రమాణ స్వీకారాలు పూర్తయిన తర్వాత వైసీపీ అధినేత జగన్ అసెంబ్లీ లోపలికి వచ్చారు. అసెంబ్లీ ప్రారంభానికి ముందే సభకు వచ్చిన ఆయన తన చాంబర్ లో ఉన్నారు. తన వంతు వచ్చిన తర్వాత లోపలికి వెళ్లి ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు జగన్. ఆ తర్వాత తిరిగి వెంటనే తన చాంబర్ కు వెళ్లి, కాసేపటి తర్వాత తాడేపల్లిలోని నివాసానికి వెళ్లారు. జగన్ ఎంట్రీపై ఎల్లో మీడియా ఆసక్తికర కథనం ఇచ్చింది. ఆయన అసెంబ్లీ వెనుక గేటు నుంచి సభలోకి వచ్చారని ఆ కథనం సారాంశం. గతంలో జగన్ సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు నుంచి మందడం మీదుగా సభకు వచ్చేవారని, ప్రస్తుతం అమరావతి రైతులు నిరసన తెలుపుతారని భావించి వేరే మార్గంలో జగన్ సభకు హాజరైనట్టు కథనాలిచ్చింది.


ఈరోజు 172 మంది ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించారు ప్రొటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి. పితాని సత్యనారాయణ, వనమాడి వెంకటేశ్వరరావు, జీవీ ఆంజనేయులు.. ఈ ముగ్గురు రేపు(శనివారం) ప్రమాణం చేస్తారు. ఇక ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ పదవి కోసం టీడీపీ సీనియర్‌ ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడు నామినేషన్‌ దాఖలు చేశారు. ఆయన తరపున కూటమి నేతలు నామినేషన్‌ పత్రాలను శాసనసభ కార్యదర్శికి అందించారు. శనివారం ఉదయం 11 గంటలకు స్పీకర్‌ ఎన్నిక జరుగుతుంది. 

Tags:    
Advertisement

Similar News