చర్చలు మళ్లీ విఫలం.. సీపీఎస్‌పై ఇరు వర్గాలు గరం గరం..

జీపీఎస్‌కి ఒప్పుకోవాల్సిందేనన్న ప్రభుత్వం మరోసారి ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చలు జరిపింది. తాజా చర్చలు కూడా విఫలం అయ్యాయి. మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఆదిమూలపు సురేష్ ఈ చర్చల్లో పాల్గొన్నారు.

Advertisement
Update:2022-09-07 21:09 IST

ఏపీలో సీపీఎస్ రగడ ఈ రోజు అనేక మలుపులు తిరిగి చివరకు అక్కడే ఆగిపోయింది. జీపీఎస్‌కి ఒప్పుకోవాల్సిందేనన్న ప్రభుత్వం మరోసారి ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చలు జరిపింది. తాజా చర్చలు కూడా విఫలం అయ్యాయి. మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఆదిమూలపు సురేష్ ఈ చర్చల్లో పాల్గొన్నారు. జీపీఎస్ గురించే మాట్లాడాలంటే మాత్రం తాము చర్చల్లో కూర్చోబోమని చెప్పిన ఉద్యోగులు వెంటనే బయటకు వెళ్లిపోయారు. అటు మంత్రుల బృందం సీపీఎస్ రద్దుకి మాత్రం ఒప్పుకునేది లేదని తేల్చి చెప్పింది. చర్చలకు రాకపోతే జీపీఎస్ కి అంగీకరించినట్టే అని ఉదయం కాస్త కటువుగా మాట్లాడినా, సాయంత్రం మాత్రం మరోసారి చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు మంత్రులు.

సవరణలకు ఒప్పుకోం..

రిటైర్‌మెంట్‌ తర్వాత 33 శాతం గ్యారంటీడ్‌ పింఛన్‌ ఇస్తామంటోంది ప్రభుత్వం. ప్రమాద, హెల్త్‌ బీమా, ఉద్యోగి మరణిస్తే భార్యకు పింఛన్ ఇస్తామన్నారు. ఉద్యోగికి రూ.10 వేలు కనీస పింఛన్‌ ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ సవరణలకు ససేమిరా అంటున్నారు ఉద్యోగులు. సీపీఎస్‌ రద్దుపై మంత్రుల కమిటీ అధ్యయనం వివరాలు ఇవ్వాలని కోరారు. సీపీఎస్‌ రద్దు అనేది తమ జీవన్మరణ సమస్య అంటున్నారు ఉద్యోగులు. జీపీఎస్‌ గురించి తప్ప.. ఇతర అంశాలపై మాట్లాడేది లేదని మంత్రులు అంటున్నార‌ని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఛత్తీస్‌ ఘఢ్‌, రాజస్థాన్‌, జార్ఖండ్‌లో కూడా సీపీఎస్ రద్దు చేశారని గుర్తు చేశారు. ఉద్యమంలో పాల్గొన్న ఉద్యోగులపై కేసులు ఎత్తివేయాలని ఉద్యోగ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.

అది తొందరపాటే..

ఎన్నికల ముందు సీపీఎస్‌ రద్దుపై తాము తొందరపడి హమీ ఇచ్చామని అన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. మేనిఫెస్టోలో పేర్కొన్న 95 శాతం హామీలు నెరవేర్చామని, నెరవేర్చని 5 శాతం హామీల్లో సీపీఎస్‌ రద్దు ఉందని చెప్పారు. తీవ్రమైన కేసులపై సీఎం జగన్‌తో మాట్లాడి, సానుకూల నిర్ణయం తీసుకుంటామన్నారు బొత్స. సవరించిన జీపీఎస్‌పై సీఎంతో చర్చించి తుది నిర్ణయం ప్రకటిస్తామన్నారు. జీపీఎస్‌కు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పారు బొత్స. అయితే ఉద్యోగులతో మరోసారి చర్చలకు తాము సిద్ధమని ప్రకటించారు.

సీపీఎస్‌ రద్దుపై ఉద్యోగులు మరోసారి ఆలోచించాలని సూచించారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఉద్యోగులకు మరింత భద్రత కల్పిస్తామని చెప్పారు. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ వల్ల భవిష్యత్తులో ఆర్ధిక విపత్తు సంభవిస్తుందని అన్నారు సజ్జల. పెన్షన్ కోసం ప్రభుత్వంపై 20 వేల కోట్ల రూపాయల భారం పడుతోందని వివరించారు. తమది రాజకీయ అవకాశవాదం కాదని.. 20, 30 ఏళ్ళ తర్వాత రాష్ట్రం ఎలా ఉన్నా తమకేంటి అనుకునే నాయకత్వం తమది కాదని అన్నారు. చర్చలకు రాబోమని ఉద్యోగులు చెప్పడం సరికాదన్నారు సజ్జల.

Tags:    
Advertisement

Similar News