టీడీపీపై మాట్లాడేందుకు తెలుగు రాదంటూ తప్పించుకున్న ఏపీ మంత్రులు
టీడీపీ ఆరోపణలను తిప్పికొట్టకుండా మౌనం దాల్చిన మంత్రులకు సీఎం జగన్ వార్నింగ్ ఇచ్చిన తర్వాత కొత్త కొత్త అంశాలు చర్చకు వస్తున్నాయి.
టీడీపీ ఆరోపణలను తిప్పికొట్టకుండా మౌనం దాల్చిన మంత్రులకు సీఎం జగన్ వార్నింగ్ ఇచ్చిన తర్వాత కొత్త కొత్త అంశాలు చర్చకు వస్తున్నాయి. కొందరు మంత్రుల తీరును ఇప్పుడు బహిరంగంగా చర్చించుకుంటున్నారు. ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు అసెంబ్లీలో, బయట మైకు దొరికితే చాలు సర్ మీరు మాకోసం వచ్చిన దేవుడు అంటూ భజన చేసిన వారు.. మంత్రులయిన తర్వాత మాత్రం నోరు విప్పడం లేదు.
టీడీపీ వాళ్లు పని గట్టుకుని వైఎస్ భారతీని టార్గెట్ చేస్తుండడంతో మహిళా మంత్రి ద్వారా కౌంటర్ ఇప్పిస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో సీఎంవో ప్రతినిధులు ఒక మంత్రికి మాట్లాడాల్సిన వివరాలను పంపగా..తనకు తెలుగు సరిగా రాదని, ఇంగ్లీష్‌లో అయితే మాట్లాడగలుగుతానంటూ సదరు ఫస్ట్ టైం గెలిచిన మంత్రి తప్పించుకున్నారు. రెండోసారి మంత్రి పదవి నిలబెట్టుకున్న మరో మంత్రి కూడా ఇలాగే మనదంతా ఇంగ్లీషే, తెలుగులో ధీటుగా మాట్లాడడం మనకు రాదే అంటూ తప్పించుకున్నారట. ఈ విషయాన్ని సీఎం దృష్టికి సీఎంవో అధికారులు తీసుకెళ్లగా జగన్ ఒకింత షాక్ అయ్యారని సమాచారం.
ప్రతిపక్షం విమర్శలు తిప్పికొట్టకుండా తప్పించుకుని తిరిగేందుకు ఇద్దరు మంత్రులు తెలుగు రాదంటూ చెప్పిన కారణంపై నొచ్చుకున్న సీఎం.. ఆ ఇంగ్లీష్ మంత్రుల పేర్లు ఎత్తకుండానే కేబినెట్ సమావేశంలో క్లాస్ తీసుకున్నారు. తెలుగు రాకుంటే ఇక్కడ ఉండటం ఎందుకు? రిటైర్‌మెంట్ తీసుకోవచ్చుకదా అని సీఎం క్లాస్ పీకారు. ఇలా ఏమాత్రం బాధ్యత లేకుండా పదవి వచ్చింది కదా.. టీడీపీతో గొడవెందుకు అన్నట్టుగా వ్యవహరిస్తున్న మంత్రులను ఉద్దేశించి సీఎం చాలా సీరియస్ అయ్యారు.