నమ్మక ద్రోహి శ్రీధర్ రెడ్డి.. అసెంబ్లీలో వైసీపీ ఎదురుదాడి
శ్రీధర్ రెడ్డి ప్రశ్నలకు ఆర్థిక మంత్రి బుగ్గన కాస్త నచ్చజెప్పేలా బదులిచ్చినా, మరో మంత్రి అంబటి రాంబాబు మాత్రం తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శ్రీధర్ రెడ్డి నమ్మక ద్రోహి అని అన్నారు.
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నిరసన ప్రదర్శనగా అసెంబ్లీకి వచ్చి, నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమస్యల ప్లకార్డ్ పట్టుకుని సభలో నిలబడ్డారు. పదే పదే మంత్రుల ప్రసంగానికి ఆయన అడ్డు తగిలారు. ఓ దశలో స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పదే పదే కూర్చోవాలని కోరారు. తనకు రిప్రజెంటేషన్ ఇస్తే మంత్రులకు ఇచ్చి సమస్యలు పరిష్కరించే దిశగా చొరవ తీసుకుంటామన్నారు. కానీ శ్రీధర్ రెడ్డి మాత్రం తగ్గదే లేదంటూ నిలబడి ప్లకార్డ్ పట్టుకుని తన నిరసన తెలిపారు. సమస్యల పరిష్కారానికి హామీ ఇవ్వాలన్నారు.
నమ్మకద్రోహి..
శ్రీధర్ రెడ్డి ప్రశ్నలకు ఆర్థిక మంత్రి బుగ్గన కాస్త నచ్చజెప్పేలా మాట్లాడినా, మరో మంత్రి అంబటి రాంబాబు మాత్రం తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శ్రీధర్ రెడ్డి నమ్మక ద్రోహి అని అన్నారు. ఆయన అసెంబ్లీకి వచ్చి అందరి దృష్టిలో పడాలని, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనే ఇలా ప్రవర్తిస్తున్నారని చెప్పారు. ఆయన్ను తాను చాలా రోజులుగా గమనిస్తున్నానని, శ్రీధర్ రెడ్డి నైజం మంచిది కాదన్నారు. సభలో అటువైపు వెళ్లి మరీ నినాదాలు చేయాల్సిన అవసరమేమొచ్చిందని ప్రశ్నించారు.
టీడీపీ సపోర్ట్..
అసెంబ్లీలో శ్రీధర్ రెడ్డి ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలంటూ టీడీపీ సభ్యులు కూడా ఆయనకు సపోర్ట్ గా మాట్లాడారు. దీనిపై వైసీపీ మండిపడింది. తెల్లారే సరికి శ్రీధర్ రెడ్డి మీవాడైపోయాడా, మీ సపోర్ట్ ఎందుకు అని ప్రశ్నించారు అంబటి రాంబాబు. చంద్రబాబు, అచ్చెన్నాయుడు మెప్పు పొందాలనే శ్రీధర్ రెడ్డి కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. అవసరమైతే ఆయనపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ ని కోరారు.