బాబుకు ఏపీలోనే నిలువ నీడ లేదు.. తెలంగాణలో ఎవరు ఆదరిస్తారు : మంత్రి రజని
చంద్రబాబు వ్యాఖ్యలను తాజాగా వైద్యారోగ్య శాఖ మంత్రి విడుదల రజని దుయ్యబట్టారు.
చంద్రబాబు తెలంగాణ పర్యటన సందర్భంగా చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్, వైసీపీ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. వ్యాక్సిన్ కనిపెట్టడానికి కారణం తెలుగదేశం పార్టీనే అని, తన వల్లే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని ఆయన ఎప్పటి లాగే సొంత డబ్బా కొట్టుకున్నారు. దీంతో బీఆర్ఎస్ నాయకులే కాకుండా తెలంగాణ ప్రజలు కూడా చంద్రబాబుపై విరుచుకపడుతున్నారు. ఇక ఖమ్మం నుంచి ఉత్తరాంధ్ర పర్యటనకు వెళ్లిన చంద్రబాబు అక్కడ వైసీపీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. చంద్రబాబు వ్యాఖ్యలకు ధీటుగా వైసీపీ మంత్రులు కూడా స్పందిస్తున్నారు. చంద్రబాబు చేసిన ఆరోపణలను బలంగా తిప్పికొడుతున్నారు.
చంద్రబాబు వ్యాఖ్యలను తాజాగా వైద్యారోగ్య శాఖ మంత్రి విడుదల రజని దుయ్యబట్టారు. విశాఖపట్నానికి సచివాలయం తరలించడాన్ని చంద్రబాబు వ్యతిరేకిస్తున్నారని.. దీంతోనే ఆయన ఉత్తరాంధ్ర వ్యతిరేకి అనే విషయం స్పష్టమైందన్నారు. అందుకే ఉత్తరాంధ్రలో చంద్రబాబు పర్యటనకు ప్రజల నుంచి ఎలాంటి స్పందన రావడం లేదన్నారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలని పెద్దలు చెబుతుంటారు. కానీ చంద్రబాబు విషయంలో పూర్తిగా తేడా కొట్టిందన్నారు. ఏపీలోనే చంద్రబాబుకు నిలువ నీడ లేదు.. ఇక తెలంగాణలో ఆయనను ఎవరు ఆదరిస్తారని ఎద్దేవా చేశారు. బీజేపీ నేతల కళ్లలో పడటానికే చంద్రబాబు షో చేస్తున్నారని ఆరోపించారు.
తనకు ఇరు రాష్ట్రాల్లో ఆదరణ ఉందని చూపించుకొని, రాబోయే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికే ఇదంతా చేస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు. చంద్రబాబుకు ఏపీలోనే దిక్కులేదని విమర్శించారు. తన పర్యటనలకు పోలీసులు రాకుండా అడ్డుకుంటున్నారని చంద్రబాబు అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారు. ఆయన చేసే ఆరోపణల్లో ఎలాంటి పస లేదన్నారు. అసలు ప్రజలే స్వచ్ఛంధంగా ఆయన పర్యటనల్లో పాల్గొనడం లేదని తేల్చి చెప్పారు. తన సభలకు జనాలు రావడం లేదనే అసహనంతోనే పోలీసుల మీదకు తప్పును నెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
అసలు చంద్రబాబు వైపు ప్రజలు చూడాల్సిన అవసరం ఏముందని మంత్రి ప్రశ్నించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలోని తమ ప్రభుత్వానికి ప్రజల నుంచి ఆదరణ, మద్దతు ఉంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. సంక్షేమ పథకాలు అన్నీ ఇంటి వద్దకే చేరుతున్నాయని గుర్తు చేశారు. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వైసీపీ ఘన విజయం సాధించిందని.. ఇదే మాకు ప్రజల నుంచి ఎంత మద్దతు ఉందో తెలియజేస్తోందన్నారు.
2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత చంద్రబాబు ఒక సైకోలా వ్యవహరిస్తున్నారని రాజాం వైసీపీ ఎమ్మెల్యే కంబాల జోగులు విమర్శించారు. అంతకు ముందు రాష్ట్రాన్ని పాలించిన చంద్రబాబు.. ఖజానాను మొత్తం ఖాళీ చేసి రాష్ట్రాన్ని దివాళా తీయించారని మండిపడ్డారు. ఇటీవల పార్లమెంటులో చంద్రబాబు ఎన్ని అప్పులు చేశారో కూడా కేంద్ర ప్రభుత్వం తెలియజేసిందన్నారు. నీరు-చెట్టు పథకం పేరు చెప్పి కోట్లాది రూపాయలు దోచుకున్నారని విమర్శించారు. ఇక ఇప్పుడు చంద్రబాబు మాటలను ఎవరూ నమ్మే పరిస్థితి లేదని ఆయన అన్నారు.